తహసీల్దార్లు ఇక సబ్‌రిజిస్ట్రార్లు | MROs in Telangana to get lessons in registration | Sakshi
Sakshi News home page

తహసీల్దార్లు ఇక సబ్‌రిజిస్ట్రార్లు

Published Tue, Feb 6 2018 1:39 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

MROs in Telangana to get lessons in registration

కరీంనగర్‌సిటీ: భూముల రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా చేపట్టేందుకు భూముల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం తహసీల్దార్లకు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది.  సోమవారం నుంచే హైదరాబాద్‌లో తహసీల్దార్లకు ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ పాసుపుస్తకాలను పట్టాదారులకు అందజేసే ప్రక్రియను ఆరంభించనున్న క్రమంలో మార్చి 12 నుంచి తహసీల్దార్‌ కార్యాలయాలను రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు యథావిధిగానే పనిచేయనున్నాయి. ఉమ్మడి జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు లేని మండలాలన్నింటిలో తహసీల్దార్లకు సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

భూ తగాదాలు, సమస్యలకు చెక్‌ పెడుతూనే లెక్కలు పక్కాగా ఉండేందుకు సర్కారు మరో నిర్ణయానికి అంకురార్పణ చేస్తోంది. ఇప్పటికే భూ లెక్కలు పక్కాగా ఉండాలని ముందడుగు వేసిన ప్రభుత్వం భూ రికార్డుల శుద్ధీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలకు భూ రికార్డుల ప్రక్షాళన ముగింపు పలికింది.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. జిల్లాల విభజన అనంతరం శాఖలను కూడా విభజించినప్పటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను మాత్రం ఉమ్మడిగానే ఉంచారు. ఏటా ఈ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 180 నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. అయితే.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ కొన్ని సబ్‌రిజిస్ట్రార్ల కార్యాలయాల్లోనూ ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లతో అక్రమాలు జరగడంతో పలు సమస్యలు ఎదురయ్యాయి. మియాపూర్‌ కుంభకోణం అనంతరం ప్రభుత్వం ఎనీవేర్‌ ప్రక్రియను రద్దు చేసింది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటున్న ప్రభుత్వం చిన్నచిన్నగా సబ్‌రిజిస్ట్రార్ల అధికారాలకు కోత పెట్టే విధంగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాంపుల రిజిస్ట్రేషన్‌ యాక్టు 6 ప్రకారం స్థిర, చరాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం ఉండగా తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. కరీంగనగర్‌ జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, తిమ్మాపూర్, గంగాధరలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి.

జగిత్యాల జిల్లాలో మల్యాల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, సిరిసిల్లలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. భీమదేవరపల్లి వరంగల్‌ జిల్లాలో, హుస్నాబాద్‌ సిద్దిపేట జిల్లాలో కలిసిపోయాయి.  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లతోపాటు వివాహ నమోదు, ఎన్‌కంబర్స్‌మెంట్, గిఫ్ట్‌డీడ్, భాగస్వామ్య ఒప్పందాల వంటి దాదాపు 30 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నాయి. అయితే.. వీటిలో ముఖ్యవైనవి భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్లు మాత్రమే. నిబంధనల ప్రకారం ఆస్తిని విక్రయించి రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే పేరు మార్పిడికి సంబంధిత తహసీల్దార్‌ లేదా మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఆన్‌లైన్‌ అనుసంధానం ద్వారా సమాచారం బదిలీ జరగాలి. నిర్ణీత గడువులోగా మ్యుటేషన్‌ చేసి ఆస్తిమార్పిడి, పట్టామార్పిడి వంటివి పూర్తి చేయాలి. అయితే.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరిగిన లావాదేవీలకు పేరు మార్పిడి చేయడంలో ఆలస్యమవుతోంది. ప్రభుత్వానికి ఆస్తిమార్పిడి వ్యవసాయ భూముల పట్టా మార్పిడికి తగిన రుసుములు చెల్లించినా.. ఫలితం ఉండడం లేదు. ఈ కారణంగా ఆస్తులను విక్రయించిన వ్యక్తులు తిరిగి విక్రయాలు జరపడంతో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. అమాయకులు మోసపోతున్నారు. ఒకే భూమికి రెండు, మూడు సార్లు రిజిస్ట్రేషన్లు చేయడం, అక్రమంగా ఒకే భూమిని ఇద్దరికి, ముగ్గురికి మ్యుటేషన్లు జరపడంతో సర్వే నెంబర్లలో వాస్తవ విస్తీర్ణం కంటే రికార్డుల్లో అధికంగా నమోదవుతోంది. ఇటువంటి విషయాలే ప్రభుత్వం జరుపుతున్న భూ శుద్ధీకరణలో వెలుగుచూడడంతో సీఎం కేసీఆర్‌ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ల బాధ్యతను తహసీల్దార్లకే అప్పగించి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు లేని మండల కేంద్రాల్లో మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 62 మండలాలుండగా 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మినహా అన్ని మండల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాద్యతలు నిర్వర్తించనున్నారు. 

మోయలేని భారమంటున్న తహసీల్దార్లు..
ఉమ్మడి జిల్లాలో 16 మండలాలకు తహసీల్దార్లుండగా వారందరికీ రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగిస్తే సబ్‌రిజిస్ట్రార్లకు చాలా వరకు పనితగ్గిపోనుంది. అయితే ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థ కొనసాగుతోంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థ నిషేధం ఉన్నా అమలవ్వడం లేదు. ఈ వ్యవస్థ అనధికారికంగా కొనసాగుతూనే ఉంది. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లోనూ డాక్యుమెంట్ల స్కానింగ్‌ను, ఇతర పనులకు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగిస్తే ఏ మేరకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో సేవలందుతాయనేది వేచి చూడాల్సిందే. అయితే.. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉండే సర్వర్‌కు అనుగుణంగా ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌ అనుసంధానం ఉంది. కొత్తగా మండల కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగిస్తే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏ విధంగా సౌకర్యాలున్నాయో వాటన్నింటినీ కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తహసీల్దార్లు కార్యాలయాల ద్వారా 60 రకాల సేవల్లో తలమునకలై ఉన్నారు. కొత్త అధికారాలతో తమపై అధిక భారం పడనుందని పలువురు తహసీల్దార్లు ఆందోళనతో ఉన్నారు. 

రైతులకు ప్రయోజనం..
భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగిస్తే ఎంతో ప్రయోజనమని రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతం భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతోంది. భూ కొనుగోలుదారుడు తన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వీఆర్‌వో, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌ దాదాపు నెల రోజులపాటు విచారణ జరిపి, ఉత్తర్వులను సిద్ధం చేసి 15 రోజుల్లో ఆర్డీవోకు నివేదిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తారు. నిబంధనల ప్రకారమే ప్రక్రియ పూర్తవ్వడానికి 45 రోజులు పడుతుంది. అధికారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి పట్టాదారు పాసుపుస్తకాల జారీ జరుగుతోంది. కొత్త విధానంలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తే అదే రోజు మ్యుటేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడానికి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ తర్వాత మ్యుటేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement