
తిరుమలాయపాలెం: దశాబ్దాలుగా కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడిన తిరుమలాయపాలెం మండలం నేటి నుంచి సస్యశ్యామలం కానుంది. కరువును తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు రెండో దశ ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుండెపుడి వద్ద ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు వరుణుడిపై భారం వేస్తూ పంటలు సాగు చేస్తున్న మండల రైతాంగానికి భక్తరామదాసు ప్రాజెక్టులతో కరువు తీరనుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ఏడాది పాలేరు నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించి.. మండలంలోని ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులు నింపారు.
కాకరవాయి, పైనంపల్లి, బచ్చోడు, బచ్చోడుతండా, రాజారం, జూపెడ, సోలీపురం, రఘునాథపాలెం గ్రామాలకు భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో మంత్రి తుమ్మల ప్రత్యేక కృషితో సీఎం కేసీఆర్ చేత ఈ ప్రాజెక్టుకు రూ.4.3కోట్ల నిధులు మంజూరు చేయించారు. 1.9 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి వద్ద ఎస్సారెస్పీ కాల్వల్లోకి నీటిని విడుదల చేయనున్నారు. అనతి కాలంలోనే సుబ్లేడు గోనెతండా వరకు పైపులు ఏర్పాటు చేసి.. ఎస్సారెస్పీ కాల్వల్లోకి వదిలే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణం పూర్తి చేశారు. మండలంలోని ఏడు గ్రామలతోపాటు కూసుమంచి మండలంలోని రెండు గ్రామాల్లో 16,365 ఎకరాలకు సాగునీరు అందనుంది. పాలేరు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు పైగా సాగునీరందనుంది.
Comments
Please login to add a commentAdd a comment