
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పరిశీలించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో 2017 నవంబర్ 13న జిల్లాలో నిర్వహించిన నేషనల్ ఎచీవ్‌మెంట్ సర్వే (నాస్) ఫలితాలలో జిల్లా విద్యార్థులు చతికిలపడ్డారు. దీంతో జిల్లా విద్యా వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. మూడు, ఐదు, ఎనిమిదవ తరగతి విద్యార్థులను సర్వే చేయగా 8వ తరగతి వారు అన్ని సబ్జెక్టుల్లోనూ వెనుకంజలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టత ఆవశ్యతకను ఈ సర్వే మరోమారు స్పష్టం చేసింది.
163 పాఠశాలలు.. 2,529 మంది విద్యార్థులకు పరీక్ష...
జిల్లాలోని 163 పాఠశాలలకు చెందిన 2,529 మంది విద్యార్థుల కనీస సామర్థ్యాలు తెలుసుకునేందుకు విద్యా శాఖ అధికారులు నవంబర్ 13న పరీక్షలు నిర్వహించారు. మూడు, ఐదవ తరగతి విద్యార్థులకు తెలుగు, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల్లో, 8వ తరగతి విద్యార్థులకు తెలుగు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టారు. ఇందుకోసం 340 మంది ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థుల సేవలను వినియోగించుకున్నారు. కాగా ఇటీవల ఈ సర్వే పరీక్షల పలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.
కనీస సామర్థ్యాల్లో వెనుకంజే...
ఇతర జిల్లాలతో పోలిస్తే కనీస సామర్థ్యాలలో జిల్లా విద్యార్థులు వెనకంజలోనే ఉన్నారు. ఈ ఫలితాల విశ్లేషణను బట్టి దిగువ తరగతుల నుంచి ఎగువ తరగతులకు వెళ్లే కొద్దీ ఈ శాతం తగ్గుతూ ఉండటం గమనార్హం. భాషా సామర్థ్యాలలో కొద్దిపాటి మెరుగు ఉన్నప్పటికీ సైన్స్, గణితంలలో మరీ వెనుకబడిపోయారు. 3వ తరగతి విద్యార్థులు ఈవీఎస్‌లో 65.09 శాతం, తెలుగు భాషలో 66.24, గణితంలో 66.84 శాతంతో ఉన్నారు. 5వ తరగతి విద్యార్థులు ఈవీఎస్‌లో 51.24, తెలుగులో 55.22, గణితంలో 53.38 శాతాలతో ఉన్నారు.
ఎనిమిది చూస్తే ఏడుపే..!
ఎనిమిదవ తరగతి ఫలితాలను పరిశీలిస్తే ఏడుపే మిగులుతుంది. ఉన్నత విద్యలో ప్రభుత్వ విద్యార్థుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అన్ని సబ్జెక్టులలో కనీస సామర్థ్యాల్లో వెనుకబడే ఉన్నారు. భాషా సామర్థ్యాల్లో తప్పితే ఇతర సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత శాతం కూడా దాటకపోవడం శోచనీయం. భాషలో 45.98, సైన్స్‌లో 32.31, సోషల్‌లో 30.77, గణితంలో 29.27 శాతంతో అట్టడుగు స్థాయిలో ఉన్నారు. ఈ ఫలితాలతో ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ విద్యార్థుల ర్యాంకును ఊహించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాలుర కంటే బాలికలే మిన్న..
నాస్ ఫలితాలలో మూడవ తరగతిలో తప్ప 5, 8 తరగతుల్లోని అన్ని సబ్జెక్టుల్లో బాలుర కంటే బాలికలే మెరుగ్గా ఉన్నారు. అనేక పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో బాలికలే ముందంజలో ఉండగా.. నాస్‌లోనూ వారే మెరుగ్గా ఉండడం గమనార్హం.
సర్వేలో వెల్లడించిన కొన్ని అంశాలిలా...
మూడవ తరగతి విద్యార్థులు క్రీడాంశాలలో రూల్స్, ఇన్‌డోర్, అవుట్‌డోర్ క్రీడలను సైతం గుర్తించలేకపోతున్నారు.
కుటుంబసభ్యుల నడుమ బంధాలను సైతం తెలపలేకపోతున్నారు.
కొలతలు, సెంటీమీటర్లు, మీటర్ల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించలేకపోయారు.
పరిసరాలు, జంతువులు, మనుషుల మధ్య సంబంధాలను 5వ తరగతి వారు కూడా గుర్తించలేకపోతున్నారు.
విలువలు, వాటి స్థానాల గుర్తింపులో వెనుకబడి ఉన్నారు.
గుణింతాలు, భాగాహారాలలో 5వ తరగతి విద్యార్థుల జ్ఞానం చాలా తక్కువగా ఉంది.
పై, బార్ చార్టులను రాయడం, గుర్తించడంలో, రేషనల్ నంబర్స్‌లో 8వ తరగతి విద్యార్థులు జీరోగా ఉన్నారు. సైంటిఫిక్ అంశాలను నిత్యజీవితానికి అన్వయించిన వారు 9.18 శాతం మంది మాత్రమే.
విద్య, వైద్యం వంటి ప్రభుత్వ శాఖలను పేర్కొనటంలో 8వ తరగతి విద్యార్థులు జీరో శాతంతో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment