రోడ్డెక్కిన స్కీం వర్కర్లు | scheam workers darna for wages and pension | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన స్కీం వర్కర్లు

Published Wed, Jan 24 2018 10:40 AM | Last Updated on Wed, Jan 24 2018 10:55 AM

scheam workers darna for wages and pension - Sakshi

విజయవాడలో ధర్నా చేస్తున్న స్కీం వర్కర్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఏ అభివృద్ధి పథకాన్ని అమలు చేసినా విజయవంతం చేసేది స్కీం వర్కర్లే. పగలనక, రాత్రనక కష్టపడితేనే అవి లబ్ధిదారులకు అంది, ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. ఎంతో మందికి మేలు చేస్తున్న స్కీం వర్కర్ల జీవితాలు అట్టడుగున ఉంటున్నాయి. కనీస జీతానికి, వసతులకు నోచుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కనీస వేతనం ఇవ్వాలని, పింఛన్, గ్రాట్యూటీ, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంగళవారం రోడ్డెక్కారు. ఆందోళనను భగ్నం చేసేందుకు పాలకులు కుట్ర పన్నినా వెరువక ధర్నాలు, మానవహారంతో జయప్రదం చేశారు.

సాక్షి, విజయవాడ: ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు ఆందోళనకు దిగారు. నగరంలోని ధర్నా చౌక్‌లో కార్మికులు నిరసన తెలిపారు. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. మండలాల కేంద్రాల్లో నిరసన తెలిపి అధికారులకు వినితిపత్రాలు అందజేశారు. ఆందోళనలో అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, సాక్షర భారతి, సర్వశిక్షాభియాన్, 2వ ఏఎన్‌ఎం, కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌లలో పనిచేసే  వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు.

మానవహారం
విజయవాడ ధర్నాచౌక్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు, సీఐటీయు కార్యదర్శి బేబి రాణి, ఎన్‌సీహెచ్‌ సుప్రజ, ఎ.కమల పాత్రుడు ఐఎఫ్‌టీయు నాయకులు రామారావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కీమ్స్‌లో పనిచేసేవారిని కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.

బందరులో..
బందరు కోనేరు సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. బస్టాండ్‌ నుంచి కోనేరు సెంటర్‌ వరకు స్కీమ్‌ వర్కర్లు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. కార్యక్రమంలో ఏపీ అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పి.రెజీనారాణి, నాయకురాలు రమాదేవి పాల్గొన్నారు.  పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో విధులు బహిష్కరించి మానవహారం నిర్వహించారు. నూజీవీడు సబ్‌కార్యాలయం వద్ద వర్కర్లు ధర్నా నిర్వహించారు. కంకిపాడు, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరిగాయి.

అణచివేసేందుకు కుట్ర..
స్కీమ్‌ వర్కర్స్‌ సమ్మెను ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించింది. రెండు రోజులు ముందు నుంచి అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకంలోని యూనియన్‌ నాయకులను పిలిచి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ అధికారులు హెచ్చరించారు. విజయవాడ, బందరులో కొంతమందిపై కేసులు పెడతామంటూ బెదిరించారు. అయినా కార్మికులు సమ్మెలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కార్మికులకు మద్దతు..
గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న స్కీం వర్కర్లు, విద్యుత్‌ కార్మికుల ఆందోళనకు అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్‌టీయూ) మద్దతిస్తుందని యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు ప్రకటించారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న విద్యుత్‌ కార్మికులు తలపెట్టిన సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

డిమాండ్స్‌..
కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలని, పెన్షన్‌ రూ.3000, పీఎఫ్, గ్రాట్యూటీ, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్లలో ప్రధానమైనవి. ప్రభుత్వ పథకాలకు 2018–19లో నిధులు పెంచాలని, పథకాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement