కంకిపాడు (పెనమలూరు): మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూపొందించిన పథకమే ‘మనకోడి’. ఈ పథకం కింద లబ్ధిదారులకు రెయిన్‌బో రోస్టర్స్ జాతికి చెందిన కోడి పిల్లలను పంపిణీ చేస్తారు. మేలైన యాజమాన్య చర్యలు పాటించి వాటిని సంరక్షిస్తే కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటున్నారు కంకిపాడు మండల పశువైద్యాధికారి డాక్టర్ కర్నాటి మాధవరావు. మన కోడి పథకం వివరాలు ఆయన మాటల్లోనే...
అమలు ఇలా..
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మనకోడి పథకం అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాకు 10 వేల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో లబ్ధిదారుకి 45 కోడి పిల్లలు పంపిణీ చేస్తారు. రెయిన్‌బో రోస్టర్స్ జాతికి చెందిన కోడి పిల్లలను పంపిణీచేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మొదటి విడత 25 కోడిపిల్లలు, రెండో విడత మరో 20 పిల్లలుచొప్పున ఇస్తారు. జిల్లాకు మంజూరైన యూనిట్లలో 95 శాతం యూనిట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. మిగిలిన 5 శాతం యూనిట్లు ఇతరులకు కేటాయిస్తారు. ఒక్కో యూనిట్ విలువ రూ.4560. లబ్ధిదారులు చెల్లించాల్సి వాటా రూ.810. ఈ మొత్తాన్ని అర్జీదారు గ్రామీణ పశువైద్య కేంద్రాల్లో చెల్లించాలి. లేదా పశుసంవర్ధకశాఖ జేడీ పేరున డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్థికంగా చేయూత
మనకోడి పథకం కింద నెల రోజులు వయస్సు ఉన్న కోడి పిల్లలను లబ్ధిదారులకు పంపిణీచేస్తారు. పిల్లల పెంపకంలో తీసుకునే శ్రద్ధను బట్టి కోడి బరువు 4 నుంచి 5 కిలోలు వరకూ పెరుగుతాయి. మాంసంగా మార్కెట్‌లో విక్రయించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆడవి అయితే ఏడాదికి 180 వరకూ గుడ్లు పెడతాయి. మాంసం, కోడిగుడ్ల అమ్మకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూత లభిస్తుం దనటంలో ఎలాంటి సందేహం లేదు. లబ్ధిదారుడికి కోడి పిల్లలతో పాటుగా మేత పెట్టుకునేందుకు, నీరు పెట్టేందుకు గిన్నెలు, వాటి సంరక్షణకు మెస్‌లు కూడా అందిస్తారు.
నిబంధనలు ఇవీ..
♦ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
♦ దరఖాస్తుదారులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారై ఉండాలి.
♦ డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండాలి.
♦ వ్యక్తిగత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులు అందించాలి.
♦ పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 31వ తేదీ లోపు సమీప పశువైద్య కేంద్రాల్లో అందించాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఎప్పటికప్పుడు తెగుళ్లు సోకకుండా, వ్యాధుల బారిన పడకుండా వాటిని సంరక్షించుకోవాలి. ఎక్కువగా ఒకదాన్ని ఒకటి పొడుచుకుని ఎక్కువగా గాయపడి చని పోయే అవకాశం ఉంది. కుక్కల బారిన పడకుండా చూడాలి. జాగ్రత్తలు పాటిస్తే మన కోడి లాభదాయకంగా ఉంటుంది. – డాక్టర్ కర్నాటి మాధవరావు, పశువైద్యాధికారి, కంకిపాడు
Comments
Please login to add a commentAdd a comment