పట్టించుకుంటే ‘ఒట్టు’! | voters list corections delay | Sakshi

పట్టించుకుంటే ‘ఒట్టు’!

Jan 23 2018 9:23 AM | Updated on Oct 16 2018 6:35 PM

voters list corections delay  - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. మొదట మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటింటి సర్వే చేపట్టడం వల్ల ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం దారి తప్పిపోయింది. రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఈ సారి నాలుగైదు నెలలు ముందుగా నిర్వహించేందుకు యత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యంత్రాంగం మాత్రం స్తబ్దుగా మిన్నకుండడం  గమానార్హం. ముందస్తుగా ఎన్నికలు జరిగితే 2017 ఓటర్ల జాబితా సవరణ ద్వారా ప్రకటించే తుది  జాబితానే ప్రామాణికం అవుతుంది. నిబంధనల ప్రకారం జాబితా సవరణ కార్యక్రమం మొదలయ్యే రోజున ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఈ సారి మాత్రం జాబితా సవరణలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ముగిసినప్పటికీ ముసాయిదా జాబితాను ప్రకటించలేదు. దీన్ని ప్రకటిస్తే ఓటర్లు అందులో తమ పేరు ఉందో లేదో చూసుకొని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ముసాయిదా జాబితాను ఇంత వరకూ ప్రకటించ లేదు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా డిసెంబరు 17, 24వ తేదీలను ప్రత్యేక ఓటరు నమోదు దినాలుగా ప్రకటించడంతో 6,677, 7,664 దరఖాస్తులు వచ్చాయి. ఇంత వరకు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిపై బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి విచారణ జరపాలి. ఆన్‌లైన్‌లో సీఈఓ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూలు ప్రకారం ఈ నెల 20న తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నా ఇప్పటి దాకా పట్టించుకోకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితా సవరణ పూర్తై తుది జాబితా ప్రకటించిన తర్వాత జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, ఎన్నడూ లేని విధంగా అస్తవ్యస్త పరిస్థితులు నెల కొన్నాయి. రాజకీయ పార్టీలు సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నా ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల యంత్రాంగం స్తబ్దుగా ఉండి పోయింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినా జాబితా ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఈ సారి ముసాయిదా ఓటర్ల జాబితా లేకుండానే ఒకటి రెండు రోజుల్లో తుది ఓటర్ల జాబితా వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఓటర్ల దినోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక : కలెక్టర్‌
ఈ నెల 25న అన్ని నియోజకవర్గాల్లో 8వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆర్‌డీఓలు, ఈఆర్‌ఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తామని, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, నియోజక వర్గ కేంద్రాల్లో అనువైన ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. పంచాయతీల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి టామ్‌టామ్‌ వేయించాలని, 25న 2కే రన్‌ నిర్వహించి ప్రధాన కూడళ్లలో మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించాలని, ఫోక్‌ డ్యాన్స్, మిమిక్రీ, కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొదటి సారిగా ఓటర్లుగా నమోదైన యువతను, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వెటరన్‌ ఓటర్లను గుర్తించి సత్కరించాలని సూచించారు.  వీడియో కాన్పరెన్స్‌లో డీఆర్‌ఓ శశీదేవి, జడ్పీ సీఇఓ ఈశ్వర్,స్పెషల్‌ కలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ అనురాధ, డీఎస్‌డీఓ జగన్నాథరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ జుబేద బేగం ఎన్నికల సెల్‌ సూపరింటెండెంటు యూనస్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement