స్టేషన్ మహబూబ్‌నగర్ : చేతినిండా ఉపాధి లేదు.. ఏదైనా చిరు వ్యాపారం చేసుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. నిరుద్యోగ మైనార్టీ యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం మంజూరుచేసి 9నెలలు గడిచినా సబ్సిడీ రుణాలు ఇంకా చేతికందలేదు. 2017–18కి మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఉమ్మడి జిల్లాకు(మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల) 861యూనిట్లు కేటాయించి రూ.9.19కోట్లు మంజూరు చేశారు. 26మండలాలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు 443యూనిట్లకు రూ.4.72కోట్ల 75లక్షలు మంజూరు చేశారు. క్యాటగిరీ–1(రూ.లక్ష)కు 356యూనిట్లు కేటాయించి రూ.2కోట్ల 84లక్షల 80వేలు మంజూరుచేయగా క్యాటగిరీ–2 (రూ.లక్ష నుంచి రూ.3లక్షలు)కు 68 యూనిట్లకు రూ.95లక్షల 20వేలు, క్యాటగిరీ–3(రూ.3లక్షల నుంచి రూ.10లక్షలు) 19యూనిట్లకు రూ.95లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నాగర్‌కర్నూల్‌కు 148 యూనిట్లకు రూ.కోటి 57లక్షల 40వేలు, జోగుళాంబ గద్వాల జిల్లాకు 145యూనిట్లకు రూ.కోటి54లక్షల 40వేలు, వనపర్తి జిల్లాకు 125యూనిట్లకు గాను రూ.కోటి32లక్షల 40వేలు నిధులు కేటాయించారు.
ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమయ్యేనా..?
గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు యూనిట్లు తక్కువగా కేటాయించడం.. వేలల్లో దరఖాస్తులు రావడంతో చాలామందికి సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షగా మిగిలేది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు వేర్వేరుగా మైనార్టీ సబ్సిడీ రుణాలు మంజూరుచేసింది. ఇప్పటికీ ఆన్‌లైన్ ప్రారంభించకపోవడంతో రుణాలు అందుతాయో లేదోనన్న ఆందోళన నిరుద్యోగ యువతలో వ్యక్తమవుతోంది.జిల్లాలు ఏర్పడడంతో ఎక్కువమంది రుణాలు లభిస్తాయని కొండంత ఆశతో ఉన్నవారంతా ఆవేదనకు గురవుతున్నారు. వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు.
ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు
మైనార్టీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అన్ని రికార్డులను సిద్దం చేశాం. జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లాలోని బ్యాంకులకు యూనిట్లు కూడా కేటాయించాం. ప్రభుత్వం నుంచి ఇంకా ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
– వెంకటేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి
రుణాలు అందజేయాలి
సబ్సిడీ రుణాల యూనిట్లు మంజూరుచేసి 9నెలలు గడిచినా ఇప్పటికీ ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించకపోవడం సరికాదు. మైనార్టీ సంక్షేమానికి పాటుపడుతున్నామన్న ప్రభుత్వ మాటలు కేవలం నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించి రుణాలు అందజేయాలి.
– ఖాజా అజ్మత్‌అలీ, మైనార్టీ నేత, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment