విశాఖపట్నం, న్యూస్‌లైన్: 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసింది. కానీ బీసీ, ఎస్సీ, మైనార్టీ, వికలాంగులకు రుణాలు మాత్రం అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక ఆలస్యంగా ఖరారు కావడం లబ్ధిదారుల కొంపముంచింది. ఏటా కోట్లాది రూపాయల మేరకు రుణాలిచ్చే బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, బ్యాంకులు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ఆఖరి నెలయిన మార్చిలో రుణాలు మంజూరవుతాయనుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలను రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. లబ్ధిదారుని వాటా రద్దు చేశారు. రుణాల కోసం ఎన్నికల కోడ్ ముగిసేవరకు నిరీక్షణ తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
బీసీ కార్పొరేషన్‌లో...
రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద జీవీఎంసీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో 2445 యూనిట్లు లక్ష్యం.
సబ్సిడీ కింద 6.71కోట్లు అందజేయాల్సి ఉంది.
బ్యాంకులు రూ.6.71కోట్లు రుణాలుగా ఇవ్వాల్సి ఉంది
ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 1912 మంది దరఖాస్తుల వివరాలు నమోదు చేశారు.
వీరిలో 1328 మందికి రుణాలు మంజూరయ్యాయి.
ఎవరికీ సబ్సిడీలు, రుణాలివ్వలేదు.
ఎస్సీ కార్పొరేషన్‌లో..
ఈ ఏడాది 1503 యూనిట్లు లక్ష్యంగా ఉంది.
రూ.13.80కోట్ల మేరకు రుణాలు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 980 దరఖాస్తులొచ్చాయి.
ఇందులో 705 మందికి అర్హత ఉన్నట్టు గుర్తించారు.
జీవీఎంసీ పరిధిలో 498 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 89 దరఖాస్తులు రాగా, 61 మందికి రుణాలు మంజూరు చేశారు.
ఎవరికీ సబ్సిడీలు, రుణాలందలేదు
సెట్విస్‌లో 410 మందికి రుణాలు
గత ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ యువశక్తి పథకం కింద 510 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా, రూ.6.10కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యంగా ఉంది. 920 వరకు దరఖాస్తులు రాగా, 610 మందికి అర్హత ఉన్నట్టు తేల్చారు. వీరిలో 410 మంది లబ్ధిదారులకు రూ.30వేల వంతున సబ్సిడీలు విడుదల చేశారు. వీరికి బ్యాంక్ రుణాలు అందజేశారు. మరో 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి.
వికలాంగుల సంక్షేమశాఖలో..
గత ఆర్థిక సంవత్సరంలో 50 యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం రూ.50లక్షలు కేటాయించింది. ఇప్పటివరకు 60 దరఖాస్తులొచ్చాయి. ఇందులో 30 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. 16 మందికి మాత్రమే సబ్సిడీ అందింది. బ్యాంక్ రుణాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది.
రుణాలివ్వకుండా రికార్డు!
Published Wed, Apr 2 2014 2:11 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement