రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గా
అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాతరల్లో రంగాపూర్ ఒకటి. మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద రెండో ఉర్సు నిరంజన్ షావలీ. ఈ నెల 17న రాత్రి నుం చి వారం రోజుల పాటు వైభవంగా జరుగుతా యి. అచ్చంపేట మండలం రంగాపూర్‌లో జరిగే ఉర్సుకు నల్లమల ప్రజలకు ప్రత్యేక సంబరాలు. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఉర్సుకు జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా లక్షన్నర మందికిపైగా భక్తులు పాల్గొంటారు. భక్తులు కందూరు చేసి మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. ఉర్సు రంగాపూర్‌గా పిలవబడుతున్న ఈ దర్గా వద్ద భక్తులు ఉత్సవాల సమయంలోనే కాక వివిధ రోజుల్లో దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్రాబాద్ మండలం ప్రజలు ఏ శుభకార్యం చేసినా మొదట కొండపై ఉన్న దర్గాను దర్శించుకుని తమ కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
దర్గా చరిత్ర
600ల ఏళ్ల క్రితం ఆరబ్‌దేశాల నుంచి అజ్మీర్‌లో స్థిరపడిన హజ్రత్ ఖాజాగరీబ్ నవాస్, ఢిల్లీలో స్థిరపడిన నిజామోద్దీన్ ఔలియా శిఘ్యలు ఇస్లాం మత ప్రచారంలో భాగంగా కాలినడకన తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. వారిలో ఐదుగురు ప్రముఖులు ఉన్నారు. అందులో హజ్రత్ నిరంజన్‌షావలీ(సయ్యద్ మహమూద్‌షాఖాద్రి) రంగాపూర్‌లోను, మరొకరు కొండపై హజ్రత్ బహావోద్దీన్‌షాఖాద్రిగా స్ధిరపడ్డారు. అలాగే నల్లగొండ జిల్లా జాన్‌పాడ్ సైదులుగా మరొకరు కొత్తూరు ఇన్ముల్ నర్వ వద్ద జేపీ పీర్లుగా, నిజామాబాద్‌లోని షాహదుల్లా హుస్సేన్, భువనగిరి జమాల్‌బహాద్‌లనే పేర్లతో స్థిరపడినట్లు ముస్లిం మతపెద్దలు చెప్పుకుంటున్నారు. ఇస్లాం మత ప్రచార నిమిత్తం నల్లమల ప్రాంతానికి వచ్చిన నిరంజన్‌షావలీ రంగాపూర్‌లో, మన్ననూర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో బహావోద్దీన్‌షా కొండ మూల మలుపు వద్ద స్థిరపడ్డారు. వారి మరణాంతరం అక్కడ దర్గాను నిర్మించారు. అ కాలం నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతవాసులు దర్గాలో ఉర్సు నిర్వహిస్తున్నారు.
గంధోత్సవం
అచ్చంపేటలోని నారాయణప్రసాద్ ఇంటి నుంచి గంధాన్ని తీసుకెళ్లడం అనవాయితీ. 17న రాత్రి అచ్చంపేట మహబుబ్‌స్వామి దర్గాతో పాటు మన్ననూర్, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, బొమ్మనపల్లి, పెనిమిళ్ల, నాగర్‌కర్నూల్, తెల్కపల్లి, కొల్లాపూర్, వనపర్తి, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. బొమ్మనపల్లి నుంచి గంధాన్ని గుర్రంపై తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గ్రామాల నుంచి బయలుదేరిన గంధోత్సవాలు అర్ధరాత్రి వరకు రంగాపూర్‌కు చేరుకుంటాయి. అన్ని ప్రాంతాల నుంచి గంధోత్సవాలు చేరుకోగానే భక్తులు నత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజునుంచి ఉర్సు కొనసాగుతుంది.
ఉమామహేశ్వర క్షేత్ర సందర్శన
రంగాపూర్‌కు 5కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్గా దర్శనం అనంతరం భక్తులు సందర్శించడం అనవాయితీ. ఉర్సుకు మూడు రోజుల ముందే ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉర్సుకు వచ్చిన భక్తులు కులమత భేదాలు లేకుండా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మత సామరస్యానికి దర్పణం పట్టే ఈ రెండు ఉత్సవాలు ఒకేసారి ముగుస్తాయి.
ప్రత్యేక బస్సులు
రంగాపూర్ నిరంజన్ షావలీ ఉర్సు, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్ వరకు 25ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్– ఉమామహేశ్వర కొండపైకి ఆరు మినీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్–అచ్చంపేట, నాగర్‌కర్నూల్–అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్–అచ్చంపేటకు బస్సులు నడిపిస్తున్నట్లు డీఎం నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment