ముంబై : మానవత్వం పరిమళించింది. పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణినీకి సాయమందించేందుకు ఓ ఆటోవాలా సాసహోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా రైల్వే ఫ్లాట్‌ఫాం మీదుగా ఆటోరిక్షాను తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రికి చేర్చాడు. ఈ హృద్యమైన ఘటన ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్‌లో గత ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భిణీ, ఆమె భర్త ఓ రైలులోని దివ్యాంగుల కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ముంబై జలమయమైన సంగతి తెలిసిందే. దాంతో రైలు సర్వీసులు ఎక్కడికక్కడ రద్దయ్యాయి.
దాంతో ఆ దంపతులు ప్రయాణిస్తున్న ట్రెయిన్‌ను విరార్ రైల్వే స్టేషన్‌లో నిలిపేశారు. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. గర్భిణీని రోడ్డుపైకి తీసుకొచ్చేందుకు ఆమె భర్త పలువురి సాయం కోరాడు. లాభం లేకపోయింది. స్టేషన్ ఆవరణలో ఉన్న ఆటోవాలా కమలాకర్ గవాడ్‌కు విషయం చెప్పి సాయం అర్థించాడు. దీంతో కమలాకర్ నేరుగా ఫ్లాట్‌ఫాం మీదుగా ఆటోను పోనిచ్చాడు. గర్భిణీని తీసుకెళ్లి సంజీవని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నిబంధనల్ని ఉల్లంఘించిన ఆటోవాలాపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సోమవారం హాజరుపరిచారు.
అతన్ని కోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేసింది. కమలాకర్ ఉద్దేశం మంచిదే అయినప్పటీకీ, నిబంధనల అతిక్రమణ నేరమని రైల్వే పోలీస్ అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్లాట్‌ఫాం మీదుగా ఆటో వెళ్తున్న క్రమంలో ప్రయాణికులు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. సెక్షన్ 154 (రాష్ డ్రైవింగ్), రైల్వే నిబంధనల అతిక్రమణ కింద ఆటోడ్రైవర్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయం చేస్తే శిక్షిస్తారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment