
తమిళసినిమా: ప్రచారాలకు, భేటీలకు దూరంగా ఉండే నటి అంటే అది నయనతార. నటిగా తన పాత్రకు న్యాయం చేశామా ‘అంతటితో తన బాధ్యత పూర్తి అయ్యిందని భావించే అరుదైన నటి ఈమె. అగ్రకథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అలాంటి వాటిలో అరమ్ ఒకటి. ఈ చిత్రం దీపావళి రేస్‌కు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంగా రూపొందిన ఆరమ్ కోసం నయనతార కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కారణం ఈ చిత్రానికి అనధికార నిర్మాత తనే అని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటే నయన్ ఇటీవల అరమ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఒక టీవీ చానల్‌కు భేటీ ఇవ్వడం విశేషం. ఈ భేటీలో ముఖ్యంగా ఇద్దరు స్టార్ నటుల గురించి ప్రస్తావించడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో రజనీకాంత్, అజిత్‌లు స్టార్ హీరోలుగా ఎందుకు రాణిస్తున్నారంటే అంటూ మొదలెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు.
ఈ అగ్రనటి ఆరంభంలోనే సూపర్‌స్టార్ రజనీకి జంటగా చంద్రముఖి వంటి సంచలన చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కుశేలన్‌లో నటించారు. ఇక శివాజీ చిత్రంలో సింగల్ సాంగ్‌కు చిందులేశారు. అదే విధంగా అజిత్‌తోనూ మూడు చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా నయనతార తన మనసులోని మాట చెబుతూ తనకు ఇష్టమైన నటుడు అజిత్ అని, ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అజిత్‌తో బిల్లా చిత్రంలో నటించే సమయంలో తానేమంత పెద్ద నటిని కాదన్నారు. అయినా అజిత్ అంత స్టార్‌తో నటిస్తున్నాననే ఫీలింగ్ కలిగించకుండా ఆయన ప్రవర్తించారని తెలిపారు. రజనీకాంత్, అజిత్‌లు సహ నటీనటులను గౌరవిస్తారని అన్నారు. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడంలో వారికి వారే సాటి అని పేర్కొన్నారు. అందుకే వారు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారని నయనతార అన్నారు.