వీరి గాత్రం.. వేసింది మంత్రం.. | 2018 Most Popular Tollywood Singers | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 5:01 PM | Last Updated on Mon, Dec 24 2018 5:11 PM

2018 Most Popular Tollywood Singers - Sakshi

రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్‌ దాస్‌ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్‌ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్‌శ్రీరామ్‌ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్‌. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్‌ను ఓసారి చూద్దాం.

రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి
రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్‌ మిస్‌ కాకుండా.. మాస్‌ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్‌ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్‌ స్టార్‌ దేవీ శ్రీప్రసాద్‌ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్‌ మీడియాలో విపరీతంగా క్రేజ్‌ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్‌ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్‌ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్‌ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్‌ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్‌ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు.

దారి చూపి దుమ్ము లేపిన దాస్‌..
ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్‌ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్‌అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్‌ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్‌ దాస్‌ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్‌ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో 38మిలియన్ల మంది వీక్షించారు.

వినీ వినంగానే నచ్చేసిందే...
ఈ ఏడాది యూత్‌ను ఊపేసిన పాటల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్‌. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వర సాగర్‌.. యువ గాయకుడు అనురాగ్‌ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్‌ట్యూన్‌.. రింగ్‌టోన్‌గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్‌ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్‌ సాంగ్‌.. ఆర్‌ఎక్స్‌ 100 పిల్లా రా వంటి సాంగ్‌లను పాడి అనురాగ్‌ కులకర్ణి ఫుల్‌ ఫేమస్‌ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్‌ను యూత్‌ను కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను 140మిలియన్ల మంది చూశారు.

ఇంకేం ఇంకేం కావాలే..
ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్‌ శ్రీరామ్‌ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్‌ శ్రీరామ్‌ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్‌ అందించిన బాణీకి, సిద్‌శ్రీరామ్‌ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్‌లతో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకెళ్తోంది.

రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన..
అరవింద సమేత.. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్‌ దాస్‌ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement