చిటపట చినుకులు కురిసి 50 ఏళ్లు | 50year to Aatma Balam movie completed | Sakshi
Sakshi News home page

చిటపట చినుకులు కురిసి 50 ఏళ్లు

Published Thu, Jan 9 2014 12:37 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

చిటపట చినుకులు కురిసి 50 ఏళ్లు - Sakshi

చిటపట చినుకులు కురిసి 50 ఏళ్లు

 సందర్భం:‘ఆత్మబలం’చిత్రానికి 50 ఏళ్లు
 
 ఏ సినిమాకైనా కథే బలం. ఆ తర్వాత తారాగణం బలం. సాంకేతిక బృందం బలం. పాటలు ఇంకా బలం. ఇన్ని బలాలు ఉన్నాయి కాబట్టే ఆత్మబలం చిత్రాన్ని 50 ఏళ్లయినా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్ ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ ఇందులోనిదే. ఏయన్నార్ కెరీర్‌లో ఓ ఆణిముత్యంగా నిలిచిపోయిన ఈ చిత్రం ‘జగపతి’ సంస్థను తిరుగులేని నిర్మాణ సంస్థగా నిలబెట్టింది.
 
 ‘ఆరాధన’ సినిమా పెద్ద హిట్టు.
 నిర్మాతగా వి.బి.రాజేంద్రప్రసాద్‌కు ఇది రెండో విజయం. ‘అమ్మయ్యా... మనం నిలదొక్కుకున్నట్టే’ అని ఊపిరి ల్చుకున్నారాయన. కానీ ఎదురుగా కాలం కత్తితో గుచ్చడానికి సిద్ధంగా ఉంది. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న మెయిన్ పార్టనర్ పర్వతనేని రంగారావు హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా మొదలుపెట్టాలి. అర్జంట్‌గా కథ కావాలి. 
 
 అప్పట్లో మన సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ చలో కలకత్తా. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది... ‘ఆత్మబలం’ సినిమా స్టార్ట్. వి.మధుసూదనరావు డెరైక్టర్‌గా రెడీ. కేవీ మహదేవన్ మ్యూజిక్కు. సి.నాగేశ్వర్రావు ఫొటోగ్రఫీ. ఆత్రేయ మాటలూ పాటలూ. హీరోయిన్‌గా బి.సరోజాదేవి కాల్షీట్స్ ఇచ్చారు. జగ్గయ్య, కన్నాంబ, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం... ఇలా హేమాహేమీలంతా ఓకే.
 
 ఈ పనులు ఇలా జరుగుతుంటే... ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.
 అక్కినేని మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా అక్కడకు వెళ్లి సినిమా తీయాల్సిందే. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా హైదరాబాద్‌కు చలో అన్నారు. మొదట పాటల తయారీ మొదలైంది. కంపోజింగ్ కోసం మామ, ఆత్రేయ, మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్... నలుగురూ బెంగళూరు వెళ్లారు. బృందావన్ హోటల్‌లో బస. మామకు కథ చెబితే ‘‘ఇందులో పాటలు పెట్టడం కష్టం. సిట్యుయేషన్స్ కుదరవు’’ అనేశారు. అప్పటికాయన టాప్ మ్యూజిక్ డెరైక్టర్. ‘ఆంధ్రపత్రిక’ ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటాయనే ఇందులో సిట్యుయేషన్ కుదరదన్నాడంటే?.. వి.మధుసూదనరావుకి గుండెల్లో రాయి పడింది. రాత్రంతా ఆలోచించి సిట్యుయేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మామకు చెబితే ఓకే అన్నారు. ఆత్రేయ కూడా ఇన్‌స్పయిర్ అయిపోయారు.
 
  కానీ రెండ్రోజులైనా పాట పుట్టదే! హాయిగా నచ్చిన ఫుడ్ తింటూ, బాగా రెస్టు తీసుకుంటున్నారు తప్ప, కలం మూత మాత్రం తీయలేదాయన. దాంతో దర్శక నిర్మాతలిద్దరికీ చిర్రెత్తుకొచ్చింది. ‘రేపే మన తిరుగుప్రయాణం’ అని చెప్పేశారాయనకు. దాంతో ఆత్రేయకు కంగారొచ్చింది. నిద్ర రాకుండా ఏవో మాత్రలు తెప్పించుకుని వేసుకున్నారు. నిద్ర రాలేదు... ఆయనలోంచి పాట కూడా రాలేదు. తెల్లవారు జామునే డ్రైవర్‌ని లేపి కారులో కబ్బస్ పార్కుకి వెళ్లారు. పలచగా జనం. అంతా వాకింగ్‌కొచ్చిన వాళ్లే. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. అంతా పరుగులు. ఓ జంట మాత్రం ఓ గుబురు పొదలో దాక్కున్నారు. లోకాన్ని మరిచిపోయి ముద్దుమురిపాల్లో తేలిపోతున్నారు. ఇదంతా ఆత్రేయ కంటబడింది. ఆయనలో ప్రణయరసం ఉప్పొంగింది. ఆపై పాట పరవళ్లు తొక్కింది. ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ అంటూ పాట రెడీ. 
 
 హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ స్టార్ట్. అంతా సాఫీగానే ఉంది. అయితే మూడో షెడ్యూల్ సమయంలోనే తంటా వచ్చి పడింది. ఓ హిందీ సినిమా షూటింగ్‌లో అనుకోకుండా బి.సరోజ తలకు గాయమైంది. డాక్టరు 15 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అన్ని సినిమాల కాల్‌షీట్లూ వృథా. నిర్మాతల్లో టెన్షన్. వి.బి.రాజేంద్రప్రసాద్ ఆమె ఇంటికి వెళ్తే గూర్ఖా ఆపేశాడు. ఎంత చెప్పినా లోపలకు నో ఎంట్రీ. బి.సరోజ తల్లి చూసీ చూడనట్టు లోపలకు వెళ్లిపోయింది. దాంతో ఈయనకు ఏడుపొచ్చినంత పనైంది. అయినా తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి, డేట్లు ఎప్పుడో కనుక్కోవాలి. ఎల్వీ ప్రసాద్ కొడుకు ఆనంద్‌బాబు, ఈయనకు క్లోజ్. అతన్ని తీసుకుని బి.సరోజ ఇంటికెళ్లారు.
 
  ఒక నెల తర్వాత కాల్‌షీట్లు ఇస్తామని, 15 రోజుల్లోనే మొత్తం వర్క్ పూర్తి చేసుకోవాలని, అది కూడా అంతా మద్రాసులోనే జరగాలని కండిషన్స్. పాపం... వి.బి.రాజేంద్రప్రసాద్ పరిస్థితి అయోమయం అయిపోయింది. అక్కినేనిని మద్రాసు రమ్మనలేడు. బి.సరోజ హైదరాబాద్ రాదు. అటు నుయ్యి... ఇటు గొయ్యి. సినిమా మధ్యలో ఉంది. సరే... ధైర్యం చేసి అక్కినేనిని కలిసి విషయమంతా చెప్పేశారు. ‘‘అయితే... నేనే మద్రాసు వస్తా’’ అని భరోసా ఇచ్చారు అక్కినేని. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్‌కి కొండంత ధైర్యం వచ్చింది. మద్రాసులోని విజయా వాహినీ స్టూడియోలో సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. ‘చిటపట చినుకులు’ పాట ఇక్కడే తీశారు. తలకు తగిలిన దెబ్బ కనబడకుండా బి.సరోజ తలకు గుడ్డ కట్టారు. ఎట్టకేలకూ సినిమా రెడీ.
 
 మళ్లీ టెన్షన్. ఈసారి సెన్సార్ రూపంలో. సెన్సారాఫీసర్  శాస్త్రి చండశాసనుడు. కట్ అంటే కట్. నో డిస్కషన్. క్లైమాక్స్ చాలా భాగం కట్ చేసేయాలన్నారాయన. సినిమాకు అదే ఆయువు పట్టు. వీళ్లు ఎంత మొత్తుకున్నా వినలేదు. దాంతో క్లైమాక్స్ కట్ చేశారు. 1964 జనవరి 9న ‘ఆత్మబలం’ రిలీజైంది. పెద్ద మ్యూజికల్ హిట్టు. ఏడు పాటలూ మార్మోగిపోయాయి. అసలు పాటల కోసమే మళ్లీ మళ్లీ చూసిన వాళ్లు ఉన్నారు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ వాన పాటల్లో నంబర్‌వన్. సాహిత్యం, సంగీతం, ముఖ్యంగా ఏయన్నార్, బి.సరోజల కెమిస్ట్రీతో... పాట విన్నప్పుడల్లా మనసులో అనుభూతుల వాన కురవడం మొదలైపోతుంది. వి.బి.రాజేంద్రప్రసాద్‌కు నిజంగానే ఆత్మబలాన్ని ప్రసాదించిందీ సినిమా.
 
 క్లైమాక్స్ కట్ చేయకుంటే ఇంకా పెద్ద హిట్టయ్యేది!
 ‘‘క్లైమాక్స్ సెన్సార్ కట్‌కి గురికాకుండా ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధించేది. ఎందుకంటే క్లైమాక్స్ కట్ కావడంతో గ్రాఫ్ హఠాత్తుగా పడిపోయినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏంటంటే... హీరోకి ఉరిశిక్ష పడుతుంది. తెల్లవారితే ఉరి తీస్తారు. ఈలోగా హీరోయిన్, అతను నిర్దోషి అని చెప్పే ఆధారంతో జడ్జిని కలుస్తుంది. దాంతో ఉరి ఆగుతుంది. ఇదంతా చాలా డీటైల్డ్‌గా తీశాం. ఇంటర్‌కట్స్ వల్ల ప్రేక్షకునిలో ఉత్కంఠ కలుగుతుంది. సెన్సారాఫీసర్ ఈ ఉత్కంఠ వల్ల ప్రేక్షకుడి గుండె ఆగిపోతుందని వాదించి, ఉరిశిక్షకు సంబంధించిన షాట్స్ అన్నీ కట్ చేయించేశారు’’. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement