మావయ్య బాణీలు కట్టాలి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను గెలిచి మన దేశానికే కీర్తిని ఆపాదించారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన మరో సంగీత దర్శక తెరంగం జీవీ.ప్రకాశ్‌కుమార్. ఈయన ఏఆర్.రెహ్మాన్‌కు స్వయానా మేనల్లుడన్న విషయం తెలిసిందే. తమిళ చిత్రాల నుంచి హాలీవుడ్ వరకూ పలు భాషా చిత్రాలకు పని చేసిన ఘనత ఏఆర్.రెహ్మాన్‌ది. 25 ఏళ్ల వయసుకే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక సంగీత దర్శకుడు బహుశ భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే జీవీ.ప్రకాశ్‌కుమార్ ఒక్కరే అనుకుంటా.
అంతే కాదు ఇప్పుడీయన కథానాయకుడిగా యమ బిజీ.హీరోగా సక్సెస్ సాధించిన సంగీత దర్శకులు అరుదే. జీవీ నటించిన డార్లింగ్, త్రిషా ఇల్లన్నా నయనతార చిత్రాలు రెండూ విజయం సాధించాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా అంగీకరించిన చిత్రాలు చాలా ఉన్నా ప్రస్తుతం ఏక కాలంలో మూడు చిత్రాల్లో నటిస్తుండడం గమనార్హం. ఆ చిత్రాల వివరాలను జీవీ తెలుపుతూ ప్రసాద్ పాండియరాజ్ దర్శకత్వంలో బ్రూస్‌లీ, శ్యామ్ ఆండన్ దర్శకత్వంలో ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు, ఎం.రాజేశ్ దర్శకత్వంలో కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపారు.
వీటితో పాటు శంకర్ గుణ దర్శకత్వంలో కెట్టపయ్యన్ ఇంద కార్తీ చిత్రం చేయనున్నానని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకుడు వెట్రిమారన్ కథను అందించగా మరో దర్శకుడు అట్లీ సంభాషణలు రాస్తున్నారని తెలిపారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు తానే సంగీతాన్ని అందిస్తున్నానన్నారు. తాను హీరోగా నటించిన ఒక చిత్రానికైనా తన మావయ్య సంగీత బాణీలు కట్టాలని ఆశిస్తున్నానని జీవీ అన్నారు. ఆయన కోరిక నెరవేరాలని ఆశిద్దాం.