ప్రముఖ తమిళ దర్శకుడు విస్సు(74) ఇక లేరు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నై దురైపాక్కంలోని స్వగృహంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. 1981లో దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు విస్సు. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వం వహించిన ‘తిల్లుముల్లు’ చిత్రానికి కథారచయితగా పరిచయమయ్యారు. ‘కణ్మణి పూంగా’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు విస్సు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఆడదే ఆధారం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారాయన.
ఎస్పీ ముత్తరామన్ దర్వకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ అనే సినిమాతో నటుడిగానూ మారారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో కలిసి పనిచేశారాయన. ‘అరుణాచలం’ సినిమాలో రంభ తండ్రిగా చేసిన రంగాచారి పాత్ర ఆయనకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరనే పేరు పొందారాయన. ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సంసారం అదు నిన్‌సారం’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో విస్సు చేసిన పాత్రనే తెలుగులో గొల్లపూడి మారుతీరావు చేశారు. విస్సు మృతికి తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. విస్సుకి భార్య ఉమ, కుమార్తెలు లావణ్య, సంగీత, కల్పన ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment