సాక్షి, చెన్నై : అగ్రనటులు కమల్ హాసన్, రజనీకాంత్‌లు పార్టీలు ప్రారంభించిన తర్వాత తమిళనాడులో రాజకీయ వేడి కొద్దిగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపైనా వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో విజయ్‌కి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. తాజాగా విజయ్ కావేరి బోర్డు ఏర్పాటుపై జరిగిన ఆందోళనల్లో పాల్గొనడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఈ వార్తలపై విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక, నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తండ్రిగా నేను విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచిదే అనుకుంటున్నాను. ఇటీవలే అతని ముందు తరం నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అదో జోక్ అవుతుందని నా అభిప్రాయం. విజయ్ ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అయితే ప్రస్తుతం రాజకీయ రంగ ప్రవేశంపై ఏ నిర్ణయం తీసుకుంటాడో మాత్రం తెలియదు’ అని తెలిపారు. విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment