సీనియర్‌లకు నటుడు 'బంగారు' కానుక
చెన్నై: వంద మంది సీనియర్ సినీ కళాకారులకు నటుడు విజయ్ సేతుపతి తలా ఒక కాసు బంగారం కానుకగా అందించనున్నారు. భారతీయ సినిమా శతాబ్ధి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా 100 మంది సీనియర్ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను బహుకరించాలని ఉలగాయుదా ఫౌండేషన్ నిర్ణయించింది. కాగా ఆ బంగారు పతకాలను తానే అందిస్తానని నటుడు విజయ్‌సేతుపతి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ సినిమా తనకు చాలా చేసిందని, అందుకు ప్రతిఫలంగా ఏదైనా చేయడం తన కనీస బాధ్యతగా పేర్కొన్నారు. అందుకే శతాబ్ధి సినిమా సందర్భంగా కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1న సినిమాకు సంబంధించిన 23 శాఖలలోని సీనియర్ కళాకారులు 100 మందికి పతకాలను అందించనున్నట్లు తెలిపారు.
ఈ విషయం గురించి ఫెఫ్సీకి ఒక లేఖను అందించనున్నానని, అందులో శాఖలకు చెందిన ముగ్గురిని ఎంపిక చేసి వారి ద్వారా 100 మంది సీనియర్ కళాకారుల ను గుర్తించి వారికి బంగారు పతకాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ యుగంతో ఫిలిం మూలపడిందని, దీంతో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయితే హాలీవుడ్ తరువాత అధికంగా ఫిలిం ఉపయోగించింది మన భారతీయ సినిమానేనన్నారు. ఆ విధంగా లక్షలాది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటారన్నారు. వారిలో కొంతమందినైనా అన్వేషించి బంగారు పతకాల పంపిణీ వేడుకకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి వారికి ఈ కానుకలు అందించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు.
కాగా ఉలగాయుదా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన డైరెక్టర్ ఎస్‌పీ. జననాథన్ గతంలో భారతీయ సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో బైసెల్ సంస్థతో కలిసి జీవీ.ఫిలింస్ సహకారంతో 75 మంది సీనియర్ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను కానుకగా అందజేశారు. ఈసారి భారతీయ సినిమా శతాబ్ధి వేడుక సందర్భంగా విజయ్ సేతుపతి తనవంతు సాయం అందిస్తున్నాడు.