
పెరంబూరు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తాను సిద్ధమని నటి గౌతమి పేర్కొన్నారు. నటుడు కమలహాసన్ నుంచి దూరం అయిన తరువాత ఈమె సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తరచూ తనదైన బాణీలో స్పందిస్తున్నారు. ఆ మధ్య ప్రధాని మోదిని కలిశారు. దీంతో గౌతమి బీజేపీ తీర్థం పుచ్చుకోనుందనే ప్రచారం వైరల్ అయ్యింది. అయితే ఆ విషయం గురించి గౌతమి స్పందించలేదు. బుధవారం విరుదునగర్‌లోని విద్యార్థులతో సమావేశం అయిన గౌతమి ప్రజల ఆహారపు అలవా ట్లపై మాట్లాడారు. అదే విధంగా సమాజంలో మధ్య తరగతి ప్రజలు చాలా మంది ప్రభుత్వ రేషన్ షాపుల్లో ఉప్పు, చక్కెర వంటి నిత్యావసరం వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే వాటిలో నాణ్యత కొరవడుతోందని ఆరోపించారు.
అలాంటి వాటి వాడకం ద్వారా వివిధ రకాల వ్యాధులకు ప్రజలు గురవుతున్నారన్నారు. అదే విధంగా పొగత్రాగడం వంటి అలవాట్లలో కేన్సర్ వ్యాధికి గురవుతున్న వారిని చూస్తున్నామన్నారు. ఇక మద్యం మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై ఉదాసీనత చూపిస్తే అంగీకరించేది లేదన్నారు. చక్కెర, ఉప్పు, మైదా వంటి నిత్యావసర వస్తువుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం అయితే తాను ప్రచారం చేస్తానని గౌతమి పేర్కొన్నారు. అయితే ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారన్న విషయాన్ని ఆమె తెలపలేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment