
శివాజీ రాజాపై నటి హేమ ఫైర్
హైదరాబాద్ : నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యుడు, నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించారని సినీ నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని దర్శకరత్న దాసరి నారాయణరావుని కలిశానని ఆమె ఆదివారం తెలిపారు. తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ అన్నారు. తనపై వ్యక్తిగతంగా దూషణలు చేసినందుకే శివాజీ రాజాపై ఫైర్ అవ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శివాజీ రాజా నటుడు రాజేంద్రప్రసాద్ కి మద్దతిస్తున్నారన్న విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల మాదిరిగానే సినీ ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి శనివారం వెళ్లిన సంగతి నిజమేనన్నారు. అందువల్ల ఇంట గెలిచి రచ్చ గెలవాలని శివాజీ రాజాపై తాను స్పందించాల్సి వచ్చిందని హేమ పేర్కొన్నారు. 'మా' తరపున నాగేంద్రబాబు బిల్డింగ్ కొన్న విషయంపై నేను మాట్లాడాను. ప్రస్తుతం ఆ బిల్డింగ్ అమ్మితే రూ.30 లక్షలు కూడా రావని తాను చెప్పానన్నారు. దాంతో హేమకు మాట్లాడటం రాదు, ఆమెకు ఏం తెలియదని శివాజీ రాజా వ్యాఖ్యానించడం సంస్కారం కాదన్నారు.