నటి రాజశ్రీ నగలు చోరీ
తమిళసినిమా: ప్రఖ్యాత నటి రాజశ్రీ ఖరీదైన బంగారు నగలు,వజ్రాలు చోరీకి గురైయ్యాయి. ప్రఖ్యాత నటీమణి రాజశ్రీ. 75 ఏళ్ల రాజశ్రీ స్థానిక టీ.నగర్,సోమసుంధరం వీధిలో నివశిస్తున్నారు. మంగళవారం రాజశ్రీ తన కొడుకుతో కలసి టీ.నగర్,పనక్కల్ పార్క్ సమీపంలో గల బ్యాంక్‌లో లాకర్‌లో ఉంచిన తన బంగారు ఆభరణాలను తీసుకోవడానికి వెళ్లారు.లాకర్‌లో ఆభరణాలను తీసుకుని కారు కారు ఎక్కి తన కొడుకు రాక కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో ఒక అగంతుకుడు కారు వద్దకు వచ్చి పది రూపాయల నోట్లను కింద పడేసి కారులో ఉన్న రాజశ్రీతో అమ్మా కారు పక్కన డబ్బు పడి ఉంది తమరివా? అని అడిగాడు.
దీంతో తన డబ్బు కింద పడిందేమోనని భావించి కారు నుంచి కిందికి దిగారు.అంతలోనే ఆ అగంతుకుడి కారులోని నగల బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించాడు.కొంత దూరంలో అతని కోసం రెడీగా ఉన్న మరో వ్యక్తి మోటార్ సైకిల్‌పై ఎక్కి పారిపోయాడు. ఆ బ్యాగ్‌లో 15 లక్షల విలువైన బంగారు, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. ఊహించని ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన రాజశ్రీ కొంత సేపటికి తేరుకుని పాండిబజార్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను,ఆ ప్రాంతంలోని బంగారు ఆభరణాల దుకాణాల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక కెమెరాలో నటి రాజశ్రీతో ఒక వ్యక్తి మాట్లాడిన దృశ్యం నమోదైంది. దాని ఆధారంగా పోలీసులు విచారణ తీవ్రవంతం చేశారు. అదే ప్రాతంలో సీబీఐ అధికారినంటూ ఒక వ్యక్తి కేరళా నగల షాప్ యజమాని నుంచి లక్షల విలువైన నగలను దోచుకుపోయాడు.అతను గురించి ఇంతవరకూ పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదన్నది గమనార్హం.