
ప్రముఖ నటి సుమలత అంబరీష్ పెద్ద మనసును చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన కర్ణాటకలోని మండ్యకు చెందిన వీర జవాన్ గురు కోసం అర ఎకరం భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం తన కుమారుడి తొలి చిత్రం షూటింగ్ కోసం సుమలత మలేషియా వెళ్లారు. తొలుత గురు అంత్యక్రియలకు స్థలం కేటాయింపుల విషయంలో చిన్న సమస్య తలెత్తిందని తెలసుకున్న సుమలత తన కొడుకుతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అతని అంత్యక్రియలు నిర్వహించి, స్మారక చిహ్నాన్ని నిర్మించవచ్చని భావించారు.
అయితే ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం గురు అంత్యక్రియలను నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న సుమలత తాను మలేషియా నుంచి తిరిగివచ్చిన అనంతరం.. ఈ అర ఎకరం భూమిని అమర జవాన్ గురు కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు తెలిపారు. మండ్య కోడలిగా ఈ గడ్డపై పుట్టిన వీర జవాన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్టు సుమలత పేర్కొన్నారు.