సాక్షి, తమిళ సినిమా: కమర్షియల్ హీరోయిన్ పాత్రలు పోషించేందుకు చాలామంది ఉన్నారంటోంది తాప్సీ.. ఇంతకుముందు దక్షిణాదిలో అలాంటి గ్లామర్ పాత్రల కోసమే వెంపర్లాడిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్‌లో పింక్, నామ్ షబనా వంటి కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడంతో టోన్ మార్చేసింది. బాలీవుడ్‌లో కాస్త గుర్తింపు రావడం, చేతిలో చిత్రాలు ఉండడంతో ఈ అమ్మడు ధోరణి మారిపోయిందని సినీ జనాలు అంటున్నారు. ఇంతకు తాప్సీ ఏమన్నారంటే..
‘కొన్ని సందర్భాల్లో నేను కాస్త భయపడతాను. అయితే అది మంచికే అనుకుంటాను. భయం లేదంటే ఏదో తప్పు జరుగుతుందనే అర్థం. నేను కొత్త చిత్రాల ఎంపిక సమయంలో భయపడతాను. అయితే ఆ భయం చిత్రాల విడుదల సమయంలో ఉండదు. నా నుంచి ఎలాంటి నటనను ఆశిస్తున్నారన్న విషయం గురించి ఎక్కువగా ఆసక్తి చూపుతాను. శ్రమతోనే నేనీ స్థాయికి చేరుకున్నాను. ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామా అన్నదే ముఖ్యం. మనం విజయపథంలో ఉంటే చాలు. వైవిధ్యభరితమైన కథాచిత్రాల్లో నటిస్తున్నప్పుడు ఎలాంటి విమర్శలు వస్తున్నాయన్నది ఆసక్తిగా చదువుతాను. అయితే కమర్షియల్ పాత్రల్లో నటించినప్పుడు వచ్చే విమర్శల గురించి పట్టించుకోను. నెటిజన్ల విమర్శలనూ పెద్దగా కేర్ చేయను. తొలిరోజుల్లో నన్ను విమర్శించే వారికి బదులిచ్చేదాన్ని. అయితే ఆ తరువాత మా నాన్న సలహాతో విమర్శలకు బదులివ్వడం మానేశాను.
స్థాయి పెరిగినప్పుడు నిన్ను కిందకు పడేయడానికి కొందరు ప్రయత్నిస్తారు అని సన్నిహితులు చెప్పారు. అది నిజం అని గ్రహించాను. నిజం చెప్పాలంటే విమర్శల కారణంగా నాకెలాంటి బాధ లేదు. నన్ను నిజాయితీగా ఫాలో అయ్యేవారి కోసమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాను. వారిలో ఒకరిద్దరి ప్రశ్నలకు సరదాగా బదులిస్తుంటాను. మరో విషయం ఏమిటంటే నన్ను విమర్శించడం వల్ల నాకే మంచి పబ్లిసిటీ వస్తుందని వారు గ్రహించడంలేదు. ఇకపోతే కమర్షియల్ చిత్రాల్లో నటించడం నచ్చిందా? సామాజిక సందేశమున్న చిత్రాల్లో నటించడం నచ్చిందా? అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ రెండు విషయాలు కలిసిన కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. సామాజికపరమైన పాత్రల్లో నటించే అవకాశాలే నాకు ఎక్కువగా వస్తున్నాయి. కమర్శియల్ కథా చిత్రాల్లో నటించడానికి చాలామంది నటీమణులు ఉన్నారు. అలాంటి పాత్రలకు వారు ఉన్నప్పుడు నన్నెందుకు దర్శక నిర్మాతలు ఎంచుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ విషయంలో నాకూ బాధ లేదు’ అని తాప్సీ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment