సేనాపతి
తెలుగులో వచ్చిన క్లాసిక్ డబ్బింగ్ సినిమాల్లో ఒకటైన ఓ బ్లాక్‌బస్టర్ కమర్షియల్ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం....
ట్రాఫిక్ పోలీస్ ఎస్సై కేసులు రాస్తున్నాడు. అన్ని రూల్స్ ఫాలో అయ్యేవారిని కూడా పక్కకు తీసుకెళ్లి ఏదోక పేరు చెప్పి లంచం వసూలు చేస్తున్నాడు. ఫైన్ రాస్తే ఐదొందలు.. తనకు లంచంగా ఇచ్చి వదిలేసుకుంటే నూటాయాభై. ఒకతను – ‘‘అన్ని రూల్స్ ఫాలో అవుతున్నా.. ఎందుకివ్వాలి సార్ నూటాయాభై?’’ అని గట్టిగా అడిగాడు. ఆ పోలీసతను కోపంగా అతని బండి కీస్ లాక్కొని అంతే గట్టిగా లంచమివ్వమని అడిగాడు. అటుగా వెళుతున్న ఒక పెద్దాయన ఇది చూశాడు. బండతని పక్కనొచ్చి నిలబడ్డాడు. అతణ్ని షూ తీసి, బండి మీద పెట్టమని అడిగాడు. అతను ఆ పెద్దాయన చెప్పినట్టే చేశాడు.‘‘దాన్ని శుభ్రంగా తుడిచి ఆ నూటాయాభై తీసుకోండి.’’ అంటూ ఎస్సైకి షూ చూపించాడు పెద్దాయన. ఎస్సైకి కోపమొచ్చింది. ‘‘ఎలా కనిపిస్తున్నానురా..’’ అంటూ చెయ్యెత్తబోయాడు. పెద్దాయన.. ముందు తన పొట్టమీద చెయ్యేసుకొని చూశాడు. అక్కడే బెల్టుకు ఒక కత్తి పెట్టుకొని ఉంటాడాయన. తనకు తెలిసిన మర్మకళను గుర్తుచేసుకుంటూ చేతి వేళ్లు తిప్పి పెట్టుకున్నాడు. అంత అవసరం లేదనిపించిందో ఏమో, అదే చేతిని చాచిపెట్టి ఎస్సైని గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ఎస్సై కిందపడిపోయాడు. చుట్టూ జనం పోగయ్యారు. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు ఆ గుంపులో. పెద్దాయన్ను అడిగారు వాళ్లు – ‘‘హే ఓల్డ్‌మేన్! బైదవే.. హూ ఆర్ యూ?’’. ‘‘మీ? అ యామ్ ఆన్ ఇండియన్.’’ అన్నాడు పెద్దాయన.
ఆ పెద్దాయన పేరు సేనాపతి. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారిపై పోరాడి నిలిచిన వ్యక్తి. ట్రాఫిక్ పోలీసతన్ని కొట్టడానికి ముందు సేనాపతి రెండు హత్యలు చేశాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ హత్యలు చేశాడాయన. ఆ హత్యలెందుకు చేశావంటే ఆయన చెప్పే కారణం ఒక్కటే – ‘‘లంచం తీసుకున్నందుకు..’’.ఎనభైకి దగ్గర పడ్డ వ్యక్తి సేనాపతి. ‘‘తెల్లవారిపై పోరాడినవారు మీరు.. ఇప్పుడూ పోరాడుతున్నారు. కాకపోతే సొంతవారితో..’’ అంటుంది సేనాపతి భార్య. సేనాపతి ఏ పని చెయ్యాలనుకున్నా అతనికి తోడుండేది భార్య అమృతవల్లి ఒక్కతే.రోజులు గడుస్తున్నాయి. సేనాపతి నేరాలు కూడా ఒక్కొక్కటిగా పెరిగిపోతున్నాయి. అతను చేసే పని సమాజం కోసమే అయినా, చట్టం దృష్టిలో అది తప్పు. పోలీసులు సేనాపతిని వెతుకుతున్నారు. వాళ్లకు దొరక్కుండా తిరగాలి. ఇల్లు ఖాళీ చేశాడు. ఒక మార్చురీ వ్యాన్నే ఇల్లుగా మార్చేసుకున్నాడు. అమృతవల్లితో కలిసి ఎవ్వరికీ కనబడకుండా ఆ మార్చురీ వ్యాన్లోనే తిరుగుతున్నాడు. కానీ హత్యలు చేయడం మాత్రం ఆగలేదు. పోలీసులు సేనాపతిని వెతుకుతూ అతని కొడుకు చందూని పట్టుకున్నారు. చందూ అప్పటికి ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి చాలా కాలమైంది. చందూ ఇప్పుడు చక్కగా వెహికిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలియగానే చందూకి కోపం వచ్చింది. అమ్మ అమృత ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్లి గొడవ పెట్టుకున్నాడు – ‘‘దేశాన్ని ఉద్దరిస్తానని కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. ఒంటరిగా అయితే ఆయన వల్ల అవుతుందా అమ్మా! కాలానుగుణంగా నడుచుకోకుండా నా జీవితాన్ని, చెల్లాయి జీవితాన్ని నాశనం చేశాడు. అది నచ్చకే ఇల్లొదిలేసి వెళ్లిపోయాను. ఇప్పుడు ఆయన వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూడు! ఆయన కొడుకైన కారణంగా అడ్డమైన చోట్ల పోలీసులు నాకోసం వెతుకుతున్నారు. రోజూ విచారణ అన్న పేరుతో మూడు గంటలు నా ప్రాణాలు తీస్తున్నారు. ఎక్కడున్నాడు... చెప్పు..’’
అమృత నోరు విప్పలేదు.
‘‘పోలీసులేమైనా గాజులు తొడుక్కున్నారనుకున్నావా.. ఈజీగా పట్టుకుంటారు.’’ కొనసాగించాడు చందూ, కోపంగానే.‘‘ఎంతటి మొనగాడైనా.. ఆయన నీడను కూడా తాకలేరురా..’’ అంది అమృత. చాలా ప్రశాంతంగా చెప్పినా, గట్టిగా నొక్కి చెప్పినట్టనిపించింది చందూకి. అమృతకు సేనాపతి గురించి చాలా బాగా తెలుసు. తన భర్త పోలీసులకు దొరకడన్న ఆమె నమ్మకాన్ని నిజం చేస్తూ వరుసగా హత్యలు చేసుకుంటూ దొరక్కుండా వెళుతున్నాడు సేనాపతి. సేనాపతి పేరు తల్చుకొని లంచమంటే భయపడిపోతున్నారు అందరూ.ఇదే సమయానికి చందూ ఒక పెద్ద నేరంలో చిక్కుకున్నాడు. లంచం తీసుకొని అతనొక బస్సుకు ఇచ్చిన క్లియరెన్స్ నలభై మంది పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. బ్రేక్ ఫెయిలై లోయలో పడిన బస్సులో ఉన్న నలభై మంది స్కూల్ పిల్లలూ ఒక్కసారే ప్రాణాలొదిలారు. చందూ ఈ కేసులోంచి తనను తాను బయటపడేసుకోడానికి లంచాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. పోలీసులకు, పోస్ట్‌మార్టం చేసే డాక్టర్‌కు, వాళ్లకు, వీళ్లకు, తనను కాపాడే అందరికీ. చందూ లంచాలు ఇస్తున్నాడు. ‘అద్భుతం.’’ అని చప్పట్లు కొట్టాడు సేనాపతి. అందరికీ లంచాలిస్తూ వస్తోన్న చందూ ఒక్కసారే ఆగిపోయి సేనాపతిని చూశాడు. నోట మాట రాలేదు. ‘‘అడ్డదారుల్లో పోయి పోయి.. చివరికి చేరాల్సిన చోటుకే నువ్వు చేరుకున్నావు చూశావా..! ఆ రోజు నేను ఐదువందల రూపాయలు లంచమివ్వకుంటే కన్న కూతురుని పొట్టన పెట్టుకున్నానని అన్నావే.. ఈరోజు ఐదువేల రూపాయలు లంచం తీసుకొని నలభై మంది పిల్లల్ని చంపావు. అదీ అందరూ పసికందులు. ఎంత పెద్ద హంతకుడివిరా నువ్వూ.. అసలు ముందు నిన్ను చంపాల్రా..’’ అంటూ కత్తి తీశాడు సేనాపతి. ‘‘మీ కొడుకుని నాన్నా నేను.. నా మీద జాలి లేదా.. ప్రేమ లేదా..’’ అన్నాడు చందూ. ‘‘ప్రేమను నాకు లంచంగా ఇస్తున్నావా? కలుపు కాదు నువ్వు.. విషవృక్షం..’’‘‘క్షమించండి నాన్నా!’’‘‘ఈ సేనాపతి కోర్టులో క్షమించడాలు ఉండవు. మరణ శిక్షేరా!’’. మరణ శిక్షే విధించాడు సేనాపతి. సొంతకొడుకు చందూకి కూడా. ‘‘నాన్నా! ప్లీజ్ నా మాట విను..’’ చందూ చివరగా చెప్పిన మాట ఇది. సేనాపతి చందూ గుండెల్లోకి కత్తి దించకముందు చెప్పిన మాట ఇది. ఆ మాట చెబుతూ చందూ, వినే పరిస్థితిలో కూడా లేని సేనాపతి.. ఇద్దరి కళ్లలో ఒకేసారి నీళ్లు తిరిగాయి, వేర్వేరు కారణాలతో!