రూటు మార్చిన త్రిష
ఇవాళ గ్లామర్ పేరుతో కుటుంబ సమేతంగా చూడడానికి సిగ్గు పడే విధంగా అసలు దుస్తులు ధరించారా? అని సందేహం కలిగేలా హీరోయిన్లు నటించడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ విషయంలో వారిని మాత్రమే తప్పు పట్టడానికి వీలులేదు. వ్యాపారాత్మక దృక్పథంలో దర్శక నిర్మాతల ఒత్తిడి ఉంటుందని చెప్పక తప్పదు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే నటి త్రిష గ్లామరస్ పాత్రల్లో విజృంభించి నటించిన సందర్భాలున్నాయి.అయితే ఇటీవల ఈ చెన్నై చిన్నది తన ధోరణిని మార్చుకున్నారట.
ఆ మధ్య నటించిన అరణ్మణై-2 చిత్రంలో హన్సిక,పూనం బాజ్వాలతో పోటీ పడి అందాలారబోశారు. దీంతో అలాంటి అవకాశాలు మరిన్ని తలుపు తట్టడంతో ఇక లాభం లేదనుకుని తన రూటు మార్చారట. అయితే అంతకు ముందే తూంగావనం లాంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసు చూరగొన్నారు. అందువల్ల ఇకపై అతి గ్లామర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
ప్రస్తుతం త్రిష నాయకి అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈ బ్యూటీ నాటి నటీమణులు కాంచన, వాణిశ్రీలను గుర్తుకు తెచ్చేలా మెడ నుంచి కాలు వరకూ దుస్తులు ధరించి నటిస్తున్నారు. శ్రుతి మించిన గ్లామర్ పాత్రలు చేయడం ఇష్టం లేకే తన రూటును మార్చుకున్నట్లు త్రిష పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రలు అయితేనే నటించడానికి అంగీకరిస్తానని త్రిష చెబుతున్నట్లు సమాచారం.