
సాక్షి, తమిళసినిమా: వారు అనుకున్నది జరగదు అంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్.. కోలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీగా పేరొందిన వరూ.. హీరోయిన్ పాత్రలనే చేస్తానని మడికట్టుకుని కూర్చోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కోలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. మరో పక్క సేవ్ శక్తి పేరుతో సంస్థను నెలకొల్పి స్త్రీల సమస్యల గురించి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ గురించి ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరలక్ష్మి పెళ్లికి సిద్ధమైందని, ఇటీవల ఆమె వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ అవన్నీ వదంతులు లేని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు.
‘ నాకు వివాహ నిశ్సితార్థం జరగలేదు. పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటి ఏ ఆధారాలు లేకుండా కొందరు పనికట్టుకుని వదంతులు ప్రచారం చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఈ రంగంలోకి పనిచేయడానికే వచ్చాను. పనీపాటా లేనివారే ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తుంటారు’ అని ఆమె మండిపడ్డారు. ‘నా కఠిన శ్రమ ఎప్పటికీ అపజయాన్ని ఇవ్వదు. నా పని నేను చేసుకుపోతున్నాను. మీరు అనుకున్నది జరగదు’ అని గాసిప్ రాయుళ్లపై ఆమె ఫైర్ అయ్యారు. వరలక్ష్మీ విశాల్‌తో కలిసి నటించిన సండైకోళి-2 చిత్రం ఈ నెల 19న, విజయ్‌తో కలిసి నటించిన సర్కార్ చిత్రం వచ్చే నెల దీపావళి సందర్భంగా తెరపైకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం కన్నిరాశి, వెల్వెట్ నగరం, అమ్మాయి, నీయా-2 తదితర చిత్రాల్లో వరూ నటిస్తున్నారు. తాజాగా బుల్లితెరపైనా ప్రత్యక్షం కానున్నారు. జయటీవీలో సామాజిక ఇతివృత్తంతో ప్రసారం కానున్న ‘ఉన్నై అరిందాళ్’ అనే కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment