మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్, గుర్షరన్ పాత్రలో దివ్య సేథ్
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.. సంజయబారు రాసిన పుస్తక ఆధారంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజేన్, అనుపమ్ ఖేర్‌లు తమ పాత్రలను ధృవీకరిస్తూ, ఈ చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా మన్మోహన్ సింగ్ భార్య పాత్రలో నటించేది ఎవరో కూడా తెలిసిపోయింది. మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు తెలిసింది. గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు ధృవీకరిస్తూ.. ఒక ఫోటోను అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ఈ ఇద్దరు తమ తమ పాత్రకు తగ్గట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. అచ్చం మన్మోహన్, గుర్షరన్‌లా మాదిరిగానే కనిపిస్తున్నారు. ‘చాలా ప్రతిభావంతురాలైన దివ్యా సేథ్ షాను పరిచయం చేస్తున్నాం. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గుర్షరన్‌లా దివ్య నటించనుంది’’ అని అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మన్మోహన్ పాత్రకు సంబంధించిన పలు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయ్ రత్నాకర్ గట్టే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒక దేశానికి నేతృత్వం వహించాలన్న కల సాకారం కావాలంటే అందుకు ఏళ్ల తరబడి రాజకీయ కృషి.. ప్రజాజీవితం.. ఇలా చాలానే కావాలి. కానీ.. అవేవీ లేకుండానే ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న కథే ఇది.
Comments
Please login to add a commentAdd a comment