భయం పుట్టిస్తున్న ప్రేమ
తమిళ సినిమా, న్యూస్‌లైన్: ప్రేమ అంటే ఏహ్యభావం పుడుతుందేమోనన్న భయమేస్తోందని చెబుతోంది నటి నజ్రియా నజీమ్. గ్లామర్ పేరుతో జుగుప్సాకరమైన సన్నివేశాల చిత్రీకరణను ఖండిస్తూ సంచలన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ మలయాళి కుట్టికి మంచి అవకాశాలు తలుపులు తడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు ఈ బ్యూటీ కాల్‌షీట్స్ డైరీ ఫుల్ అట. ప్రస్తుతం బాలాజీ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న నజ్రియా కొన్ని ప్రత్యేక విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె నోటనే విందాం.
అదృష్టం అంతా ఒకేసారి నన్ను వరించిందని చెప్పాలి. నేను తొమ్మిదో తరగతి వరకు దుబాయ్‌లో చదివాను. దుబాయ్‌లో నాకు ఎల్‌కేజీ నుంచే స్నేహితులున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ మిస్ అవ్వడం బాధగా ఉంది. ఆ తరువాత తిరువనంతపురంలో చదివాను. అక్కడి పాఠశాలలో ఎన్నో కట్టుబాట్లు, రెండు జడలు వేసుకోవాలి. యూనిఫామ్ దుస్తులు ధరించా లి వంటి షరతులతో ఏమిటో జీవితం అని ఫీలైన సందర్భం లేకపోలేదు. అలాంటి సమయంలో ఆదిరై, పార్వతి, అనామిక, మీనాక్షి వంటి స్నేహితురాలు లభించడం సంతోషకరమైన విషయం.
అప్పటి నుంచి పాఠశాల జీవితం ఆనందమయమనే చెప్పాలి. యువి అనే నా మ్యూజిక్ ఆల్బమ్ యూ ట్యూబ్‌లో ప్రేక్షకులను అలరించింది. తిరువనంతపురంలోని కళాశాలలో బి.కాం చదవడానికి సిద్ధమయ్యాను. అయితే ఆ కళాశాలలో అడ్మిషన్‌కు మాత్రమే వెళ్లాను. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటికి ఎవరైనా అధ్యాపకులు తారస పడితే తప్పకుండా కళాశాలకు రమ్మని అంటుంటారు. నటి మీరానందన్, మేగ్నారాజ్ కలిస్తే ఊరు చుట్టేస్తాం. ఎక్కడ మంచి హోటల్ ఉంటే అక్కడ చేరిపోతాం. మేగ్నారాజ్ చికెన్ ఐటెమ్స్ బాగా లాగించేస్తోంది. మీరానందన్ రకరకాల దోసెలు ఆరగిస్తుంది. నాకు మాత్రం ఈ రెండూ ఇష్టమే.
తమిళ చిత్రాలే ఎక్కువ
నేను ఎక్కువగా చేస్తున్నది తమిళ చిత్రాలే. నేరం, రాజారాణి, నయ్యాండి చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. తిరుమణం ఎన్నుమ్ నిక్కా చిత్రం త్వరలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నా కాల్‌షీట్స్ డైరీ పుల్ అయ్యింది. మరిన్ని నూతన అవకాశాలు వస్తున్నాయి. రాజారాణి చిత్రంలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నటుడు ఆర్య ఎప్పుడే నవ్విస్తుంటారు. ఆర్య నా కిప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. నేనిప్పుడు సంపాదిస్తున్నానని అనవసరంగా ఏది పడితే అది కొనను. సినిమా రంగానికి రాకముందు నాకవసరం అయిన దాన్ని నాన్నే సమకూర్చేవారు. ఇప్పుడు కూడా ఏమి కావాలన్నా నాన్ననే అడుగుతా. నేను నటినైన తరువాత మంచి హ్యాండ్‌బ్యాగ్స్ ఖరీదైన సెల్‌ఫోన్లు కొనుక్కున్నాను. ఏ చిత్రం చూసినా ప్రేమ పాత్రలే. అయితే కథా కోణం మారుతుంది కాబట్టి అలాంటి పాత్రలు చేయడం నాకు బోర్ అనిపించడం లేదు. అయితే సినిమాల్లో ప్రేమించి, ప్రేమించి నిజ జీవితంలో ప్రేమ మీద ఏహ్యభావం కలుగుతుందేమోనన్న భయం మాత్రం కలుగుతోంది. ఎవరినైనా ప్రేమించాలనే కోరిక కలిగినా సినిమాల్లో అదే కథ చేస్తున్నాం, జీవితంలోనూ అది అవసరమా అనే భావం కలగకూడదుగా అంటోంది సంచలన నటి నజ్రియా.