
ఏం తినాలన్నా భయమేస్తోంది..!
‘‘నన్ను నేను ఓ ‘కామన్ మ్యాన్’లా అనుకుంటా. అందుకే ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డాడు? అనే కథాంశంతో రూపొందిన ‘దృశ్యం’లో నటించా’’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. అప్పట్లో ‘మహానది’లో కూతుర్ని కాపాడుకోవడానికి తాపత్రయపడే తండ్రిగా నటించారు. ఆ చిత్రానికీ ఈ ‘దృశ్యం’కీ దగ్గర పోలికలున్నాయి కదా? అనే ప్రశ్న కమల్ ముందుంచితే -‘‘మలయాళ ‘దృశ్యం’ దర్శకుడు జీతు ‘మహానది’ చూశారో లేదు నాకు తెలియదు. కానీ, ‘దృశ్యం’ ఆ జానర్ సినిమానే. కాకపోతే, ఈ చిత్రం తీసిన విధానం, కథ సాగే తీరు వేరేగా ఉంటుంది’’ అన్నారు.
చాలా విరామం తర్వాత గౌతమి ఈ చిత్రంలో నటించారు. ఆమె నటన గురించి కమల్ చెబుతూ -‘‘ఇన్నేళ్ల విరామం గౌతమికి సినిమా గురించి ఇంకొంత అవగాహన ఏర్పడేలా చేసింది. అయితే, బాధపడదగ్గ విషయం ఏంటంటే.. ఫిమేల్ ఆర్టిస్టులు ఈ కళను బాగా అవగాహన చేసుకునే సమయానికి రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ, గౌతమి ఆ ఫీలింగ్‌ని అధిగమించి, ‘పాపనాశం’లో నటించగలిగింది’’ అన్నారు. ప్రస్తుత సమాజం గురించి కమల్ మాట్లాడుతూ -‘‘ఇవాళ అన్నీ కలుషితమైపోయాయి.
విద్య కలుషితమైంది. బోధనా విధానం చూస్తుంటే భయం వేస్తోంది. అది మాత్రమే కాదు.. విద్య చాలా ఖరీదైపోయింది. ఇక, ఆహారం విషయానికొస్తే, అది కూడా కలుషితమైపోయింది. ఏం తిన్నా భయపడుతూ తింటున్నాం. రాజకీయ వ్యవస్థ అయితే ఘోరంగా తయారయ్యింది’’ అన్నారు.