మనసుకి నచ్చిన వ్యక్తిని మనువాడితే ఆ ఆనందం అంతా మనసులోనే కాదు.. ముఖారవిందంలో కూడా కనిపిస్తుంది. మంగళవారం సోనమ్ కపూర్ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్ కనిపించింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆనంద్ అహూజా, సోనమ్ కపూర్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా భార్యాభర్తలయ్యారు. సిక్కు సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. ముంబైలోని కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ బంగళా ఈ పెళ్లికి వేదిక అయింది. ఎరుపు రంగు లెహంగా, చోళీ, డిజైనర్ జ్యువెలరీలో సోనమ్ మెరిసిపోయారు. బంగారు వర్ణం డిజైనర్ షేర్వానీలో ఆనంద్ హ్యాండ్‌సమ్‌గా కనిపించారు. ఈ వేడుకకు అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతానందా, ఆమిర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావ్, ముద్దుల తనయుడు తైముర్‌తో సహా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
జాన్వీకి సారీ చెప్పిన సోనమ్
సోనమ్ పెళ్లి వేడుకల్లో శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ సెంటరాఫ్ ఎట్రాక్షన్. అలాగే జాన్వీకి సోనమ్ ‘సారీ’ చెప్పడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. సోనమ్ సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పెళ్లికి ఆచరించే సంప్రదాయాల్లో పెళ్లి కూతురు చేతికి ఎరుపు, తెలుపు గాజులు, వాటికి వేలాడుతూ ‘కలేరి’ ధరించాల్సి ఉంటుంది. ఈ కలేరి అవివాహితుల తలకు తగిలితే వాళ్లకు త్వరగా పెళ్లవుతుందని విశ్వాసం. సోనమ్ సరదాగా జాన్వీ తలకు కలేరీని తగిలించబోతే జాన్వీ కంగారు పడింది. పెదనాన్న (బోనీకపూర్) కూతురు, చెల్లెలు జాన్వీని అలా ఆటపట్టించి, ‘సారీ’ చెప్పారు సోనమ్. తన తలకు కలేరి తగలకపోవడంతో జాన్వీ ఫేస్‌లో రిలీఫ్ కనిపించింది. ఇలాంటి చమక్కులతో సోనమ్ కీ షాదీ సందడి సందడిగా జరిగింది.
మధ్యాహ్నం పెళ్లి.. సాయంత్రం చేంజ్!
మెహందీ, సంగీత్, పెళ్లి.. ఒక్కో రోజు ఒక్కో వేడుక. మూడు రోజులు సోనమ్ కపూర్ పెళ్లి పనులు సరదాగా జరిగాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనమ్‌కు మంగళవారం సాయంత్రం వరకూ తన పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసే తీరిక లేకపోవడం సహజం. అయితే తనను ఇన్‌స్టాగ్రామ్, ట్వీటర్‌లలో ఫాలో అవుతున్న 12లక్షల మందికి పైగా ఫాలోయర్స్‌కు మాత్రం ‘ఒక్క చేంజ్’తో పెళ్లయిన విషయాన్ని చెప్పారీ కొత్త పెళ్లికూతురు. ఎలా అంటే.. ఇన్‌స్టాగ్రామ్, ట్వీటర్ అకౌంట్ యూజర్ నేమ్‌ను చేంజ్ చేశారామె. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి చేసుకున్న సోనమ్ సాయంకాలానికల్లా యూజర్ నేమ్‌ను ‘సోనమ్‌కపూర్ అహుజా’ అని మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment