టైటిల్ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
జానర్ : కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
తారాగణం : నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ, దర్బా అప్పాజి అంభరీష, విశ్వనాథ్
సంగీతం : మార్క్ కే రాబిన్
దర్శకత్వం : స్వరూప్ ఆర్‌ఎస్‌జే
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క
టాలీవుడ్‌లో డిటెక్టివ్ తరహా కథలు వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఆ జానర్ సినిమాలంటే చంటబ్బాయి, డిటెక్టివ్ నారథ లాంటి సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇటీవల కాలంలో విశాల్ హీరోగా తెరకెక్కిన డిటెక్టివ్ ఒక్కటే ఈ జానర్‌లో తెరకెక్కిన సినిమా. అందుకే నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అవుతూ రూపొందిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఏజెంట్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలన్న మిషన్‌లో సక్సెస్ అయ్యాడా..? సాయి శ్రీనివాస ఆత్రేయగా నవీన్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?
కథ :
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి). నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరుతో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. పెద్దగా కేసులు లేకపోవటంతో పోలీసులకు చిన్న చిన్న కేసుల్లో సాయం చేస్తుంటాడు. అదే సమయంలో తన ఫ్రెండ్, క్రైమ్ రిపోర్టర్ శిరీష్ భారీగా దొరుకుతున్న అనాథ శవాల గురించి చెప్పటంతో ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఓ మర్డర్ కేసులో ఆత్రేయనే అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు.
జైల్‌లో ఉండగా తన కూతురిని ఘోరంగా మానభంగం చేసిన హత్య చేశారని ఓ వ్యక్తి ఆత్రేయకు చెపుతాడు. తన కూతురికి చనిపోయే ముందు ఫోన్ చేసిన ముగ్గురి ఫోన్ నంబర్లు ఇస్తాడు. బెయిల్‌పై రిలీజ్ అయిన ఆత్రేయ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఆ మూడు నంబర్లలో ఇద్దరి డీటెయిల్స్ మాత్రమే దొరకటంతో వారిని ఫాలో అవుతాడు. కానీ ఆత్రేయ ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే ఆ ఇద్దరు హత్యకు గురవుతారు. ఆ హత్య కేసుల్లో కూడా ఆత్రేయనే ముద్దాయిగా భావిస్తారు పోలీసులు.
దీంతో మరోసారి ఆత్రేయను అరెస్ట్ చేస్తారు. అతి కష్టం మీద ఐదు రోజుల బెయిల్‌తో బయటకు వచ్చిన ఆత్రేయ ఈ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ అసలు ఆ హత్యలు చేసింది ఎవరు..? ఆ మూడో ఫోన్ నంబర్ ఎవరిది..? ఆ వ్యక్తి ఏమయ్యారు? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
యూట్యూబ్ వీడియోస్‌తో పాపులర్ అయిన నవీన్ పొలిశెట్టి తొలిసారిగా హీరోగా నటించిన సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ. స్టేజ్ ఆర్టిస్ట్‌గా మంచి అనుభవం ఉన్న నవీన్, ఆత్రేయ పాత్రకు ప్రాణం పోశాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోవటంతో పాటు సీరియస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరించాడు. లుక్, యాటిట్యూడ్ ఇలా ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్ చూపించాడు. స్నేహ పాత్రలో శృతి శర్మ ఆకట్టుకున్నారు. పెద్దగా నటనకు ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించారు. ఇతర నటీనటులంతా దాదాపుగా కొత్తవారే.
విశ్లేషణ :
తెలుగు తెరమీద డిటెక్టివ్ తరహా కథలు వచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న దర్శకుడు స్వరూప్, తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. ఇంట్రస్టింగ్ స్టోరీతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందించాడు. అయితే ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ఉండాల్సిన వేగం మాత్రం లోపించింది. చాలా సన్నివేశాలు సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో చాలా భాగం ఆత్రేయ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు సమయం తీసుకున్నాడు దర్శకుడు. ద్వితీయార్థంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లోనూ స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. మార్క్ కె రాబిన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. తన మ్యూజిక్‌తో మార్క్ సినిమా స్థాయిని పెంచాడు. ఎడిటింగ్ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నవీన్ పొలిశెట్టి
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
స్లో నేరేషన్
సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment