ఆకాశ్ పూరి
‘‘ఈ క్షణం కోసం పదిహేనేళ్లుగా ఎదురు చూస్తున్నా. ‘మెహబూబా’ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఉన్నా. ఈ తరహా లవ్‌స్టోరీ మా నాన్న నుంచి వస్తుందనుకోలేదు. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమాకీ ఇంత కాన్ఫిడెంట్‌గా లేను. ‘మెహబూబా’ తో నాన్నకు చాలా మంచి పేరొస్తుంది’’ అని ఆకాశ్ పూరి అన్నారు. ఆకాశ్, నేహాశెట్టి జంటగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మెహబూబా’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ–‘‘ఇండియా– పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది.
ఈ సినిమాలో హీరోకి ఆర్మీలో చేరాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇది నా డెబ్యూ మూవీ అని హీరోయిజం చూపించలేదు. కథకు ఎంత అవసరమో అంతే చూపించారు. నా తొలి సినిమా ‘చిరుత’ నుంచి ‘మెహబూబా’ వరకూ ప్రతి సినిమాకి ఎంతో కొంత నటన నేర్చుకుంటున్నా. రామ్‌చరణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్.. వంటి స్టార్లతో నటించడం నా అదృష్టం. వారి స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి.. కష్టపడతా. నా రోల్‌మోడల్, దేవుడు రజనీకాంత్‌గారు. చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి.
నేను ఎంత బాగాచేసినా నాన్న ‘బావుందిరా’ అంటారు. కానీ, పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. 2017 అక్టోబర్ 12న ‘మెహబూబా’ షూటింగ్‌లో ఓ సీన్ చేశాక ‘సూపర్ సూపర్’ అన్నారు. ఈ రోజుని నా జీవితంలో మరచిపోలేను. నేహాశెట్టితో పోటీపడి మరీ నటించా. ‘దిల్’ రాజుగారు మా సినిమా రిలీజ్ చేస్తున్నందకు ‘థ్యాంక్స్’ చెబితే చిన్నమాట అవుతుంది. నాన్న, రాజుగారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇడియట్, పోకిరి’ సూపర్ హిట్స్ అయ్యాయి. ‘మెహబూబా’ కూడా అదే కోవలోకి వస్తుంది. బయటి కథలు కూడా వింటున్నా. కానీ, నా తర్వాతి సినిమా నాన్నగారితోనే ఉంటుంది. నేను ఇంటర్ పూర్తి చేశా. అదే నాకు ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు అనిపిస్తోంది. ఇక నా దృష్టి అంతా సినిమాలపైనే ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment