ఇప్పట్లో లవ్‌ని వదలను! | Akhil Special Interview About Mr Majnu | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో లవ్‌ని వదలను!

Published Thu, Jan 24 2019 12:34 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Special Interview About Mr Majnu - Sakshi

అఖిల్

‘‘మన బ్యాగ్రౌండ్‌ చూసి ఆడియన్స్‌ థియేటర్స్‌కు రారు. యాక్టర్‌గా కష్టపడి ఆడియన్స్‌ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. అందుకు కాస్త టైమ్‌ పడుతుంది. మెట్టు మెట్టుగా ఎదగాలి. నా గత రెండు సినిమాల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా పై ఉన్న భారీ అంచనాలు, ఒత్తిడి నాకు ఉన్న శత్రువులుగా భావిస్తున్నాను. నాకు ఉన్న భయాలు కూడా అవే. మార్పు అనేది అనుభవం నుంచి వస్తుంది’’ అని అఖిల్‌ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్, నిధీ అగర్వాల్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మిస్ట ర్‌ మజ్ను’. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అఖిల్‌ చెప్పిన విశేషాలు..

► నా తొలి సినిమా ‘అఖిల్‌’కి ముందే వెంకీ అట్లూరి నాకు కథ చెప్పాడు. ఈ సినిమా జర్నీలో మంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. కథలో నాకు, వెంకీకి  అభిప్రాయభేదాలు వచ్చాయన్న వార్తలు అవాస్తవం. షూటింగ్‌ ఫన్నీగా గడిచింది. ఈ సినిమా స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్‌ సినిమాలకు వెంకీ ఇన్‌స్పైర్‌ అయ్యాడు. కానీ కాపీ కొట్టలేదు. తాతగారి (ఏయన్నార్‌) ‘ప్రేమ్‌నగర్‌’ ఇంపాక్ట్‌ కూడా ఉంటుందీ సినిమాపై.

► మంచి ఎంటర్‌టైనింగ్‌ చిత్రం ఇది. లవర్‌గా మారే ప్లేబాయ్‌ విక్కీ పాత్రలో నటించాను నేను. రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లో విక్కీని ప్లేబాయ్‌గా చూపించగలిగాం. కానీ సినిమాలో అందుకు టైమ్‌ పడుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ స్టార్టింగ్‌లో నా క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఉంటుంది. ఆ తర్వాత లవ్‌స్టోరీ స్టార్ట్‌ అవుతుంది. స్టార్టింగ్‌లో నా పెర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఎలా ఎంగేజ్‌ చేయాలన్న విషయం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది.

► ‘మజ్ను’ అనే టైటిల్‌ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. కానీ మజ్ను అంటే ట్రాజిక్‌ లవ్‌స్టోరీ అనుకుంటారని, ఈ చిత్రం మోడ్రన్‌ లవ్‌స్టోరీ అని చెప్పడానికి మజ్నుకి మిస్టర్‌ అని యాడ్‌ చేశాం. ఈ సినిమా కూడా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు నేను 8 ప్యాక్స్‌ చేయడం ఇంపార్టెంట్‌ కాదనే విషయాన్ని ఒప్పుకుంటాను. నేను వద్దనుకున్నాను. కానీ శేఖర్‌ మాస్టర్‌ కన్విన్స్‌ చేశారు. నా క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కోసం తప్పలేదు. ఆ సాంగ్‌ షూట్‌ సెట్‌కి చరణ్‌ వచ్చారు. చరణ్‌ డ్యాన్స్‌ బాగా చేస్తారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో తారక్‌ (ఎన్టీఆర్‌)ని చూసి ‘మాస్‌’ నేర్చుకోమని నాన్నగారు (నాగార్జున) చెప్పారు. మాస్‌ ఎలా నేర్చుకోవాలో నాన్నని ఓసారి అడగాలి (నవ్వుతూ).

► బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారు చాలా మంచి నిర్మాత. తాతగారితో సినిమాలు చేసిన ఆయనతో సినిమా చేయడం నాకు గర్వంగా అనిపించింది. ‘సవ్యసాచి’ సినిమా రషెస్‌ చూసి నిధీని తీసుకున్నాం. బాగా నటించింది. ఒక లవ్‌స్టోరీకి మ్యూజిక్‌ చాలా ఇంపార్టెంట్‌. తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఆరు పాటలు ఆడియన్స్‌కు బాగా నచ్చాయి.

► ఇప్పుడు నాకు పాతికేళ్లు. రొమాంటిక్‌ సినిమాలు చేసే చాన్స్‌ బాగా ఉంది. తప్పకుండా డిఫరెంట్‌ జానర్‌ సినిమాలను చేస్తాను. కానీ లవ్‌స్టోరీ చిత్రాలను ఇప్పుడే వదలను.

► ప్రస్తుతానికి నేను సింగిల్‌. టైమ్‌ కుదిరితే మింగిల్‌ అవ్వడానికి ట్రై చేస్తా (నవ్వుతూ). రియల్‌ లైఫ్‌లో నేను ఒత్తిడిని దూరం చేసుకునేందుకు క్రికెట్‌ ఆడతా. సీసీఎల్‌ జరిగితే తప్పకుండా పాల్గొంటాను. భవిష్యత్‌లో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది.

► మల్టీస్టారర్‌ సినిమాలపై ఆసక్తి ఉంది. రెండు, మూడు స్క్రిప్ట్స్‌ నా దగ్గరికి వచ్చాయి. అప్పట్లో చేయాలని అనిపించలేదు. ఐదారుగురు ఉన్న మల్టీస్టారర్‌ మూవీ అయితే బాగుంటుంది. మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు సెట్‌ వాతావారణం కూడా ఫన్నీగా ఉంటుంది.

► ప్రస్తుతం రెండు మూడు కథలు విన్నాను. ఆ సినిమాల గురించి వచ్చే నెలలో చెబుతాను. ఇకపై సినిమాలు చేయడంలో స్పీడ్‌ పెంచుతా. ఈ దసరాకి ఓ సినిమాను రిలీజ్‌ చేద్దామనే ఆలోచన ఉంది.


నాన్నగారు (నాగార్జున) నా సినిమాల స్క్రిప్ట్‌ వింటారు. షూట్‌ ముగిసిన తర్వాత సినిమా చూసి ఇన్‌పుట్స్‌ కూడా ఇస్తారు. నేను పుట్టిన తర్వాత అమ్మగారు (అమల) సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చారు. ప్రస్తుతం మోడ్రన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌పై అమ్మకు అంతగా అవగాహన లేదు. ఎమోషనల్‌గా, యాక్ట్రస్‌గా చాలా స్ట్రాంగ్‌. నాన్నగారు నా ఫిల్మ్‌ మేకింగ్‌ విషయాలను గమనిస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement