Venki Atluri
-
జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్ దే'
‘‘అన్ని జంతువులూ నవ్వలేవు. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అంటారు. అలాగే అన్ని జంతువులకు వస్తువులు బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తాయి. మనుషులకు మాత్రమే ఏడురంగులు చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడురంగులను చూపిస్తుంది’’ అన్నారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్. నితిన్ , కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాను. అర్జున్ , అను నాకు బాగా నచ్చారు. నేను తీసిన ‘అఆ’ సినిమాలో అఅ ఉన్నాయి. ఈ సినిమాలో (అర్జున్, అను) క్యారెక్టర్స్ ఉన్నాయి. ’అఆ!’ను మించి ‘రంగ్ దే’ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నితిన్ నాకు బ్రదర్. అతను నటించిన ఏ సినిమా అయినా హిట్ కావాలని కోరుకుంటాను. ఎలాంటి పరిస్థితులనుంచైనా పాటను ఇవ్వగలడు దేవిశ్రీ ప్రసాద్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ వేదికపై నా ‘అఆ!’ సినిమా ఫంక్షన్ జరిగింది. దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీశాడు. ఈ నిర్మాతలతో ఇది నా మూడో సినిమా. నా ఫ్లాప్ మూవీస్ తర్వాత నాకో హిట్ ఇస్తున్న నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, చినబాబులకు థ్యాంక్స్. దేవిశ్రీతో నాది ఫస్ట్ కాంబినేషన్ . మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘అర్జున్ , అను క్యారెక్టర్లకు ప్రాణం పోసిన నితిన్ , కీర్తీ సురేష్‌కు థ్యాంక్స్. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లు జరగకపోయినా చిత్రయూనిట్ జీతాలు చెల్లించారు నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ. నిర్మాతలంటే నాకు మరింత గౌరవం పెరిగింది. పీసీ శ్రీరామ్‌గారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గర నేను రోజుకో విషయం నేర్చుకున్నాను’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలకు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయాల్సింది.. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ ‘రంగ్ దే’. నితిన్ కెరీర్లో ఈ సినిమా మరో హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
ప్రేమతో రంగ్ దే
నితిన్ హీరోగా, ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేశ్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ, మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ‘రంగ్ దే’ స్క్రిప్ట్‌ను నిర్మాతలు ‘దిల్’ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. సుప్రసిద్ధ కెమెరామేన్ పి.సి.శ్రీరామ్‌గారు మా సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ’’ అని వెంకీ అట్లూరి అన్నారు. ‘‘మా సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే మొదలుపెట్టాం. 2020 వేసవికి ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. నిర్మాతలు కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిషోర్, ‘సత్యం’ రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్). -
ఆ భయం పోయింది
‘‘దర్శకునిగా నా తొలి చిత్రం ‘తొలిప్రేమ’ విజయం సాధించిన తర్వాత నా రెండో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ రిజల్ట్ ఎలా ఉంటుందా? అని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఆ సినిమానే. ఒక సినిమా హిట్ సాధించింది కదా అని రిలాక్స్ అయిపోలేం’’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘మిస్టర్ మజ్ను’ ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు... ► నా తొలి సినిమా ‘తొలిప్రేమ’ కంప్లీట్ అవ్వడం, అదే టైమ్‌లో అఖిల్ రెండో చిత్రం ‘హలో!’ కూడా రిలీజ్ అవ్వడంతో ‘మిస్టర్ మజ్ను’ సినిమా సైట్స్‌పైకి వచ్చింది. ‘ప్రేమ్‌నగర్’ చిత్రంలోని ఏయన్నార్‌గారి పాత్ర ఈ సినిమాకు ఓ స్ఫూర్తి. ► నేను అనుకున్నదానికన్నా అఖిల్ 50 పర్సెంట్ ఎక్కువగానే చేశాడు. నిధీ అగర్వాల్ బాగా చేశారు. ‘తొలిప్రేమ’కు తమన్ ఎంత కష్టపడ్డాడో ‘మిస్టర్ మజ్ను’ కి కూడా అంతే కష్టపడ్డాడు. నేను రైటర్ కాకముందు నుంచే బాపీనీడు పరిచయం. ఈ సినిమా జర్నీలో ప్రసాద్‌గారితో మంచి స్నేహం ఏర్పడింది. శ్రీమణి మంచి పాటలు రాశారు. ► నిర్మాత ‘దిల్’ రాజుగారు సినిమాల విషయంలో మంచి జడ్జ్. ఆయన సలహాలను పాటిస్తాను. రాజుగారి మనవడు ఆరాన్ష్ ఈ సినిమాలోని కొండబాబు క్యారెక్టర్ చేశాడు. దాదాపు ఏడాదిన్నర వయసు ఉన్న ఆర్షాన్ రెండో టేక్ తీసుకోలేదు (నవ్వుతూ). ► ఈ సినిమాకు నాగార్జునగారు ఫస్ట్ ఆడియన్. కథ విన్నారు. ఆ తర్వాత సినిమా చూసి.. రిలాక్స్ అయిపోండి అన్నారు. రిజల్ట్ పట్ల టీమ్ హ్యాపీగానే ఉంది. ► ‘తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాంటి క్యారెక్టర్ విక్కీని స్క్రీన్‌పై చూపించానని’ అఖిల్ అన్నారు.. అంటే ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది ఇప్పుడు అలా లేనని. స్క్రీన్‌పై హీరో ఉన్నట్లు రియల్ లైఫ్‌లో ఉండలేం. అంత ధైర్యం నాకు లేదు. ► రివ్యూస్ చదివాను. కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. ఈ సినిమాకు కామన్ ఆడియన్స్ నుంచి విమర్శలు రాలేదు. మౌత్ టాక్ పాజిటివ్‌గానే ఉంది. సినిమాలోని ఎమోషన్, కామెడీ సీన్స్‌ను బాగా ఏంజాయ్ చేస్తున్నారు. ► ఒక సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడతారు. తీరా రిలీజై థియేటర్స్‌లో మార్నింగ్ షో పడగానే ఇంటర్నెట్లో ఓ పైరసీ లింక్ ఉంటుంది. ఇది బాధాకరమైన విషయం. అందుకే పైరసీ ఎపిసోడ్‌ని సినిమాలో చూపించాం. సీరియస్‌గా డీల్ చేయకండా ఆడియన్స్‌కు చెప్పాలనుకున్నాం. అలాగే చేశాం. ► దర్శకులు మణిరత్నం, త్రివిక్రమ్ గార్లు నాకు స్ఫూర్తి. నటన నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. మళ్లీ యాక్టర్ అవ్వాలనుకోవడం లేదు. రైటింగ్‌లో నా ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్నాను. ఒక రచయిత ఫైనల్ గోల్ దర్శకుడు కావడమే. ప్రస్తుతానికి ‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. నెక్ట్స్ మూవీ ఇంకా ఫిక్స్ కాలేదు. రెండు మూడు కథలు ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను. -
హిట్ గ్యారంటీ.. డౌట్ లేదు
‘‘మిస్టర్ మజ్ను’ సినిమా చాలా బాగా వచ్చింది. గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. జనరల్‌గా హీరోలు.. హీరోయిన్స్‌ని బాగా చూసుకుంటారు. కానీ, అఖిల్ మాత్రం నన్ను బాగా చూసుకున్నాడు (నవ్వుతూ). సాంకేతిక నిపుణులందరూ చాలా బాగా పని చేశారు. ప్రేక్షకులు మా సినిమా చూసి, ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా కంటే ముందే ‘మిస్టర్ మజ్ను’ కథ రాసి, నిర్మాత ‘దిల్’ రాజుగారికి వినిపించా. ‘బలమైన ఎమోషన్స్ ఉన్న కథ ఇది.. అనుభవం ఉన్న దర్శకుడైతే చక్కగా తీయగలడు. ఓ ఏడాది నాతో ట్రావెల్ చెయ్. కొంచెం అనుభవం వస్తుంది, ఆ తర్వాత చేద్దాం’ అన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే ‘తొలిప్రేమ’ కథ రాసి, రాజుగారికి వినిపించా. బాగుంది.. ‘ఈ సినిమా తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తీస్తే మంచి స్పాన్ ఉంటుంది’ అన్నారు. 2011–2012లో ఈ కథ రాశా. టైటిల్ ‘మిస్టర్ మజ్ను’ అని, సినిమా ఏఎన్ఆర్గారి వారసులతోనే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ కథకి అఖిల్ చక్కగా న్యాయం చేయగలడనే నమ్మకం కుదిరింది. తనకు కథ చెప్పగానే ఓకే అన్నాడు. ఇందులో అఖిల్‌ది ప్లేబోయ్ పాత్ర కాదు. 20నిమిషాలు నాటీ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత అంతా లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. మా సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు. ‘తొలిప్రేమ’ కంటే మంచి పాటలివ్వాలని తమన్ నాకంటే బాగా కష్టపడ్డారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను ఇలాంటి సినిమా చేసినందుకు నాన్నగారు (నాగార్జున) చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మా ఫ్యామిలీకి తగ్గ జోనర్. మంచి ప్రొడక్ట్ ఇస్తున్నామనే నమ్మకంతో ప్రతిరోజూ షూటింగ్‌కి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాణ్ని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్‌కి, వెంకీకి థ్యాంక్స్. అఖిల్ మంచి సహనటుడు. ఈ చిత్రంలోని పాత్రకు బాగా కనెక్ట్ అయ్యి చేశా’’ అన్నారు నిధీ అగర్వాల్. -
ఇప్పట్లో లవ్‌ని వదలను!
‘‘మన బ్యాగ్రౌండ్ చూసి ఆడియన్స్ థియేటర్స్‌కు రారు. యాక్టర్‌గా కష్టపడి ఆడియన్స్ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. అందుకు కాస్త టైమ్ పడుతుంది. మెట్టు మెట్టుగా ఎదగాలి. నా గత రెండు సినిమాల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా పై ఉన్న భారీ అంచనాలు, ఒత్తిడి నాకు ఉన్న శత్రువులుగా భావిస్తున్నాను. నాకు ఉన్న భయాలు కూడా అవే. మార్పు అనేది అనుభవం నుంచి వస్తుంది’’ అని అఖిల్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘మిస్ట ర్ మజ్ను’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు.. ► నా తొలి సినిమా ‘అఖిల్’కి ముందే వెంకీ అట్లూరి నాకు కథ చెప్పాడు. ఈ సినిమా జర్నీలో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. కథలో నాకు, వెంకీకి అభిప్రాయభేదాలు వచ్చాయన్న వార్తలు అవాస్తవం. షూటింగ్ ఫన్నీగా గడిచింది. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్ సినిమాలకు వెంకీ ఇన్స్పైర్ అయ్యాడు. కానీ కాపీ కొట్టలేదు. తాతగారి (ఏయన్నార్) ‘ప్రేమ్‌నగర్’ ఇంపాక్ట్ కూడా ఉంటుందీ సినిమాపై. ► మంచి ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. లవర్‌గా మారే ప్లేబాయ్ విక్కీ పాత్రలో నటించాను నేను. రిలీజ్ చేసిన ట్రైలర్లో విక్కీని ప్లేబాయ్‌గా చూపించగలిగాం. కానీ సినిమాలో అందుకు టైమ్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత లవ్‌స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో నా పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్‌ను ఎలా ఎంగేజ్ చేయాలన్న విషయం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ► ‘మజ్ను’ అనే టైటిల్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. కానీ మజ్ను అంటే ట్రాజిక్ లవ్‌స్టోరీ అనుకుంటారని, ఈ చిత్రం మోడ్రన్ లవ్‌స్టోరీ అని చెప్పడానికి మజ్నుకి మిస్టర్ అని యాడ్ చేశాం. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు నేను 8 ప్యాక్స్ చేయడం ఇంపార్టెంట్ కాదనే విషయాన్ని ఒప్పుకుంటాను. నేను వద్దనుకున్నాను. కానీ శేఖర్ మాస్టర్ కన్విన్స్ చేశారు. నా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తప్పలేదు. ఆ సాంగ్ షూట్ సెట్‌కి చరణ్ వచ్చారు. చరణ్ డ్యాన్స్ బాగా చేస్తారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో తారక్ (ఎన్టీఆర్)ని చూసి ‘మాస్’ నేర్చుకోమని నాన్నగారు (నాగార్జున) చెప్పారు. మాస్ ఎలా నేర్చుకోవాలో నాన్నని ఓసారి అడగాలి (నవ్వుతూ). ► బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారు చాలా మంచి నిర్మాత. తాతగారితో సినిమాలు చేసిన ఆయనతో సినిమా చేయడం నాకు గర్వంగా అనిపించింది. ‘సవ్యసాచి’ సినిమా రషెస్ చూసి నిధీని తీసుకున్నాం. బాగా నటించింది. ఒక లవ్‌స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆరు పాటలు ఆడియన్స్‌కు బాగా నచ్చాయి. ► ఇప్పుడు నాకు పాతికేళ్లు. రొమాంటిక్ సినిమాలు చేసే చాన్స్ బాగా ఉంది. తప్పకుండా డిఫరెంట్ జానర్ సినిమాలను చేస్తాను. కానీ లవ్‌స్టోరీ చిత్రాలను ఇప్పుడే వదలను. ► ప్రస్తుతానికి నేను సింగిల్. టైమ్ కుదిరితే మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తా (నవ్వుతూ). రియల్ లైఫ్‌లో నేను ఒత్తిడిని దూరం చేసుకునేందుకు క్రికెట్ ఆడతా. సీసీఎల్ జరిగితే తప్పకుండా పాల్గొంటాను. భవిష్యత్‌లో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది. ► మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి ఉంది. రెండు, మూడు స్క్రిప్ట్స్ నా దగ్గరికి వచ్చాయి. అప్పట్లో చేయాలని అనిపించలేదు. ఐదారుగురు ఉన్న మల్టీస్టారర్ మూవీ అయితే బాగుంటుంది. మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు సెట్ వాతావారణం కూడా ఫన్నీగా ఉంటుంది. ► ప్రస్తుతం రెండు మూడు కథలు విన్నాను. ఆ సినిమాల గురించి వచ్చే నెలలో చెబుతాను. ఇకపై సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచుతా. ఈ దసరాకి ఓ సినిమాను రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది. నాన్నగారు (నాగార్జున) నా సినిమాల స్క్రిప్ట్ వింటారు. షూట్ ముగిసిన తర్వాత సినిమా చూసి ఇన్పుట్స్ కూడా ఇస్తారు. నేను పుట్టిన తర్వాత అమ్మగారు (అమల) సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం మోడ్రన్ ఫిల్మ్ మేకింగ్‌పై అమ్మకు అంతగా అవగాహన లేదు. ఎమోషనల్‌గా, యాక్ట్రస్‌గా చాలా స్ట్రాంగ్. నాన్నగారు నా ఫిల్మ్ మేకింగ్ విషయాలను గమనిస్తుంటారు. -
మేము రెడీ..
... మీరు రెడీనా? అని అడుగుతున్నారు హీరో అఖిల్. ఎందుకంటే ఫస్ట్ లుక్‌ను చూడటానికి. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అఖిల్ తాతగారు అక్కినేని నాగేశ్వరరావు బర్త్‌డే (సెప్టెంబర్ 20) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నారట. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ లండన్‌లో పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. అఖిల్, నిధిలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
మిస్టర్ మజ్ను!
ఆ కుర్రాడి కళ్లలోకి చూస్తే చాలు ఆ మాయలో పడి అల్లాడిపోతారట అమ్మాయిలు. అతను మాట్లాడుతుంటే చాలు ఏదో హాయి స్వరం విన్నట్లు మైమరచిపోతారట అమ్మాయిలు. జనరల్‌గా ఆ లక్షణాలన్నీ లవర్ బాయ్‌కే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇలాంటి క్యారెక్టర్లోనే అక్కినేని అఖిల్ కనిపించనున్నారని టాక్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 1971లో అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రేమ్‌నగర్’లో చేసిన క్యారెక్టర్‌లోని కొన్ని షేడ్స్ అఖిల్ పాత్రలో కనిపిస్తాయని సమాచారం. ఆ సినిమాలోని ఏయన్నార్ పాత్రలో ఉండే లవ్ యాంగిల్‌ని మాత్రమే తీసుకున్నారట. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ రీసెంట్గా లండన్‌లో పూర్తయింది. తాజా షెడ్యూల్‌ను హైదారాబాద్‌లో ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ అనుకుంటున్నారట. -
లండన్‌లో ల్యాండ్ అయ్యానోచ్!
సిల్వర్ స్క్రీన్‌పై విద్యుల్లేఖా రామన్ ఉంటే చాలు. కామెడీకి కొదవ ఉండదు ఆడియన్స్‌కు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన ‘తొలిప్రేమ’ సినిమాలో ఆమె చేసిన రోల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మళ్లీ వెంకీ అట్లూరి సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అఖిల్ హీరోగా వెంకీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ యూకేలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికి లండన్‌లో ల్యాండ్ అయ్యారు విద్యుల్లేఖా రామన్. ‘‘అఖిల్ థర్డ్ మూవీలో ఎగై్జటింగ్ క్యారెక్టర్ చేయడానికి లండన్ వచ్చాను. లెట్స్ రాక్ అఖిల్’’ అని పేర్కొన్నారామె. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్ చేయనున్నారట. చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఫారిన్లో ప్రేమ మొదలు
కొత్త లవ్‌జర్నీని మొదలెట్టాడు కుర్ర హీరో అఖిల్. కానీ ఇక్కడ కాదు. ఫారిన్లో. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గురువారం యూకేలో మొదలైంది. ‘‘అఖిల్ థర్డ్ సినిమా మొదలైంది. జార్జ్ సి. విలియమ్స్ కెమెరామేన్‌గా చేస్తున్నారు. మా బ్యానర్లో ఇది 25వ సినిమా’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ‘‘కొత్త టీమ్‌తో పనిచేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్’’ అన్నారు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్లో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. మేజర్ షూటింగ్ ఫారిన్లోనే జరుగుతుంది. ఆ నెక్ట్స్ హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌తో చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట చిత్రబృందం. -
అక్టోబర్‌లో వస్తున్నాడు
రెండు నెలలకు సరిపడా వస్తువులన్నింటినీ సూట్‌కేసులో సర్దుకుంటున్నారు అఖిల్ అండ్ టీమ్. ఎందుకంటే.. నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ యూకేలో జరగనుంది. ‘‘సినిమా చాలా బాగా వస్తోంది. నెక్ట్స్ రెండు నెలల ఈ సినిమా షెడ్యూల్‌ను యూకేలో ప్లాన్ చేశాం. ఆ షెడ్యూల్‌తో దాదాపు 70 పర్సెంట్ సినిమా కంప్లీట్ అవుతుంది. యూకే నుంచి వచ్చిన తర్వాత మరో నెల రోజులు షూట్ జరిపితే సినిమా కంప్లీట్ అవుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటు న్నారు. -
క్లాప్.. క్లాప్
‘హలో’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అఖిల్. తొలి సినిమా ‘తొలిప్రేమ’తోనే సూపర్ హిట్ సాధించారు దర్శకుడు వెంకీ అట్లూరి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. దేవుని పటాలకు నమస్కరిస్తున్న అఖిల్‌పై తీసిన తొలి షాట్‌కి నాగార్జున క్లాప్ ఇచ్చారు. హీరో దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మేలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జి సి. విలియమ్స్. -
ఇక షురూ!
ఈ ఏడాది ఉగాది రోజున స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు యంగ్ హీరో అఖిల్. తన తర్వాతి చిత్రాన్ని ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎన్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా వర్క్ షురూ అయ్యింది. ‘‘న్యూ బిగినింగ్స్. ఫ్రెండ్స్ వెంకీ అట్లూరి, తమన్‌ని కలిశాను. వాళ్ల గురించి పూర్తిగా తెలసుకుంటాను. మేమంతా మంచి టీమ్ వర్క్ చేసి బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి కష్టపడతాం’’ అన్నారు అఖిల్. ‘‘మంచి ఎనర్జీతో, మంచి ఆలోచనలతో కొత్త సినిమా పని ప్రారంభించాం’’ అన్నారు వెంకీ అట్లూరి. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం బ్యాంకాంక్‌లో జరుగుతుందని సమాచారం. -
హలో.. నెక్ట్స్ మూవీ ఫిక్స్
హలో! అఖిల్ నెక్ట్స్ సినిమా ఏంటి? ఎవరితో? ఎప్పుడు? అన్న ప్రశ్నలకు ఈ ఆదివారం ఉగాది రోజున సమాధానం దొరికింది. యస్.. అఖిల్ తర్వాతి చిత్రం ఖరారైంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. మేలో చిత్రీకరణ మొదలవుతుంది. ‘‘నా తర్వాతి చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు నిర్మించనున్నారు. హ్యావ్ ఎ లవ్లీ సండే’’ అన్నారు అఖిల్. ‘‘మూవీ లవర్స్‌కి ఉగాది సర్ప్రైజ్ ఇది. త్వరలో ఈ సినిమా మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు’’ అన్నారు వెంకీ అట్లూరి. -
‘కొత్త డైరెక్టర్ చేశాడా అని పెదనాన్న షాక్ అయ్యారు’
‘‘లవ్ స్టోరీకు కావల్సింది కెమిస్ట్రీ అని అప్పుడు ఆ ‘తొలిప్రేమ’, ఇప్పుడు ఈ ‘తొలిప్రేమ’ ప్రూవ్ చేశాయి. వరుణ్, రాశీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఫిదా’ స్టార్ట్ అయ్యే టైమ్‌లో వెంకీ నా దగ్గరకు వచ్చి ‘సార్ నేనీ సినిమా బయటవాళ్లతో చేసుకుంటాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. సినిమా అయిపోయాక బాపినీడు సినిమాను తీసుకొచ్చి మళ్లీ నా చేతుల్లో పెట్టాడు. వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. ‘ఫిదా, తొలిప్రేమ’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. రాశీ బాగా చేసింది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథను నమ్మిన ‘దిల్’ రాజు గారికి థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా స్టార్ట్ అవ్వకపోయేది. నా మీద, వెంకీ మీద నమ్మకం ఉంచారు. వెంకీకి సినిమా మీద ఉన్న ప్రేమ, మేకింగ్‌లో ఉన్న కన్విక్షన్ సూపర్బ్. పెదనాన్న (చిరంజీవి) ఈ సినిమాను చూసి, డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తీశాడా అని షాక్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ పెరుగుతారు అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన వెంకీకి థ్యాంక్స్’’ అన్నారు రాశీ ఖన్నా. వెంకీ మాట్లాడుతూ – ‘‘రాశీని అనుకున్నప్పుడు భయం ఉండేది కానీ చాలా బాగా చేసింది. ఈ కథను వరుణ్ బిలీవ్ చేయటం వల్లే ఈ సినిమా ప్రాణం పోసుకుంది. ఈ సినిమాకు రెండు పిల్లర్స్ జార్జ్, తమన్. లిరిక్స్ రాసిన శ్రీ మణిగారికి థ్యాంక్స్. ప్రసాద్‌గారిని సార్ అని పిలుస్తాను కానీ నాకు ఫ్రెండ్ లాంటి వారు. బాపినీడు మంచి ఫ్రెండ్’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా వరుణ్ తేజ్‌కు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాను నమ్మి చేశాడు. టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘నేను ఫస్ట్ టైమ్ వర్క్ చేసిన హీరోస్ అందరితో బ్లాక్‌బాస్టర్స్ కొట్టాను ‘బృందావనం, కిక్, దూకుడు’.. ఈ సినిమా స్టార్ట్ అప్పుడు ఇదే అనుకున్నాను. అలాగే సూపర్ హిట్ అయింది’’ అన్నారు తమన్. -
టైటిల్ పెట్టావ్ సరే... జాగ్రత్తగా తియ్ అన్నారు
‘‘జ్ఞాపకం, స్నేహగీతం చిత్రాల్లో నటించాను. రైటర్‌గా ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ, స్నేహగీతం, కేరింత’ చేశాను. రాయటం స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి యాక్టింగ్‌వైపు ఇంట్రెస్ట్ తగ్గింది. యాక్టింగా? రైటింగా? అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రైటింగ్ టు డైరెక్షన్ అని డిసైడ్ అయ్యాను’’ అన్నారు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకీ చెప్పిన విశేషాలు... ► దర్శకులు రాఘవేంద్రరావుగారు ఆదివారం మార్నింగ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ షో మ్యాన్. అలాంటి ఆయన దగ్గర్నుంచి కాంప్లిమెంట్ రావడం ఫుల్ హ్యాపీ. ఆర్.నారాయణమూర్తిగారు కాంప్లి్లమెంట్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారు సినిమా చూసి, ట్విట్టర్లో రియాక్ట్ అవ్వడం చాలా సంతోషాన్నిచ్చింది. ► ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశా. పవన్ కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’ సినిమా అంత కాకపోయినా ఆ సినిమా గౌరవాన్ని కాపాడేలా మా ‘తొలిప్రేమ’ చిత్రం ఉంటుందని. కాపాడాననే అనుకుంటున్నాను. ‘తొలిప్రేమ’ టైటిల్ పెట్టినప్పుడు ఫ్యాన్స్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయేమో అనుకున్నాను. కానీ లేదు. ‘టైటిల్ పెట్టావ్ సరే .. జాగ్రత్తగా తియ్’ అని కొందరు ఫ్యాన్స్ అన్నారు. టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేసినప్పుడు వాళ్లు బాగా వెల్కమ్ చేశారు. ఎందుకు పెట్టావ్? అని ఏ సైడ్ నుంచి రాలేదు. ► నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ కూడా రిలీజ్ కాలేదు. టీజర్ రిలీజైంది. అప్పుడు ఇలాంటి హీరో మన సినిమాలో ఉంటే బాగుంటుందనిపించింది. వరుణ్ ‘కంచె’ చూసినప్పుడు ఏ రోల్ అయినా చేయగలడనిపించింది. ‘లోఫర్’ సినిమా టైమ్‌లో తనకు కథ చెప్పా. ఓకే అన్నారు. ఈ కథను ముందు ‘దిల్’ రాజుగారికి చెప్పాను. ఆయన చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ప్రసాద్‌గారిని కలిశాను. ప్రసాద్ తనయుడు బాపీనీడు నాకు బెస్ట్ ఫ్రెండ్. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ► త్రీ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ కోసం వరుణ్, రాశీఖన్నా లుక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇద్దరూ సూపర్‌గా నటించారు. తమన్ సొంత కథలా ఫీలయ్యి మంచి సంగీతం ఇచ్చాడు. ► సినిమా కాస్త లేట్ అయ్యింది. అది మంచికే జరిగిందనుకుంటున్నాను. స్క్రిప్ట్‌ను మరింత బాగా రెడీ చేసుకున్నా. డిస్కషన్స్ బాగా జరిగాయి. కానీ ‘ఫిదా’ రిలీజ్ తర్వాత ‘తొలిప్రేమలో’ ఏ మార్పూ చేయలేదు. ‘ఫిదా’ సినిమా రిలీజైన 10 డేస్ తర్వాత ‘తొలిప్రేమ’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. ► లవ్‌స్టోరీ, డ్రామా, కాస్త పొలిటికల్ ఇంపాక్ట్ ఉన్న సినిమాలు, బయోపిక్ జోనర్లు అంటే ఇష్టం. పొలిటికల్ ఇంపాక్ట్ అంటే.. సోషల్ మేసేజ్ రిలవెంట్ ఉన్నవి. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రసాద్‌గారి బ్యానర్లో ఓ సినిమా చేయాలి. ‘దిల్’ రాజుగారి నిర్మాణంలో సినిమా ఉంటుంది. -
సండే లంచ్ విత్ ఫ్యామిలీ
వరుణ్‌తేజ్ తెలుగు సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారమ్. ప్రస్తుతం ఈ సిన్మా పనులతో బిజీగా ఉన్న వరుణ్, నిన్న(ఆదివారం) ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ‘సండే లంచ్ విత్ ఫ్యామిలీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. -
'తొలిప్రేమ' కోసం సిక్స్ ప్యాక్..!
ఫిదా ఇచ్చిన కిక్ నుంచి అప్పుడే బయటకు వచ్చేసినట్లున్నారు హీరో వరుణ్ తేజ్. తన తర్వాతి ప్రాజెక్టు కోసం తెగ కసరత్తులు చేసేస్తున్నారాయన. ట్రైనర్‌తో కలసి జిమ్‌లో ఉన్న ఫొటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు వరుణ్. ‘ లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమిస్తున్నా. సగం సాధించా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. తదుపరి చిత్రం కోసం వరుణ్ దేహ దారుఢ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇంకా సినిమాకు పేరు నిర్ణయంచలేదు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.