వెంకీ అట్లూరి, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, అఖిల్, నిధీ అగర్వాల్
‘‘మిస్టర్ మజ్ను’ సినిమా చాలా బాగా వచ్చింది. గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. జనరల్‌గా హీరోలు.. హీరోయిన్స్‌ని బాగా చూసుకుంటారు. కానీ, అఖిల్ మాత్రం నన్ను బాగా చూసుకున్నాడు (నవ్వుతూ). సాంకేతిక నిపుణులందరూ చాలా బాగా పని చేశారు. ప్రేక్షకులు మా సినిమా చూసి, ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా కంటే ముందే ‘మిస్టర్ మజ్ను’ కథ రాసి, నిర్మాత ‘దిల్’ రాజుగారికి వినిపించా. ‘బలమైన ఎమోషన్స్ ఉన్న కథ ఇది.. అనుభవం ఉన్న దర్శకుడైతే చక్కగా తీయగలడు. ఓ ఏడాది నాతో ట్రావెల్ చెయ్. కొంచెం అనుభవం వస్తుంది, ఆ తర్వాత చేద్దాం’ అన్నారు.
ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే ‘తొలిప్రేమ’ కథ రాసి, రాజుగారికి వినిపించా. బాగుంది.. ‘ఈ సినిమా తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తీస్తే మంచి స్పాన్ ఉంటుంది’ అన్నారు. 2011–2012లో ఈ కథ రాశా. టైటిల్ ‘మిస్టర్ మజ్ను’ అని, సినిమా ఏఎన్‌ఆర్‌గారి వారసులతోనే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ కథకి అఖిల్ చక్కగా న్యాయం చేయగలడనే నమ్మకం కుదిరింది. తనకు కథ చెప్పగానే ఓకే అన్నాడు. ఇందులో అఖిల్‌ది ప్లేబోయ్ పాత్ర కాదు. 20నిమిషాలు నాటీ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత అంతా లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది.
మా సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు. ‘తొలిప్రేమ’ కంటే మంచి పాటలివ్వాలని తమన్ నాకంటే బాగా కష్టపడ్డారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను ఇలాంటి సినిమా చేసినందుకు నాన్నగారు (నాగార్జున) చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మా ఫ్యామిలీకి తగ్గ జోనర్. మంచి ప్రొడక్ట్ ఇస్తున్నామనే నమ్మకంతో ప్రతిరోజూ షూటింగ్‌కి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాణ్ని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్‌కి, వెంకీకి థ్యాంక్స్. అఖిల్ మంచి సహనటుడు. ఈ చిత్రంలోని పాత్రకు బాగా కనెక్ట్ అయ్యి చేశా’’ అన్నారు నిధీ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment