బన్ని’ వాసు, నాగబాబు, అల్లు అర్జున్, వక్కంతం వంశీ, లగడపాటి శ్రీధర్
‘‘వంశీగారు చెప్పిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథలో అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోకి ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న గోల్ ఉంటుంది. ఒక వ్యక్తి సమాజానికి అంకితమయ్యే జీవితాన్ని బతుకుదామనుకోవడం గొప్ప విషయం. అందుకే నాకు మిలటరీవారంటే ప్రత్యేక గౌరవం’’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.
కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషాశ్రీధర్ నిర్మాతగా, ‘బన్ని’ వాసు సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం మే 4న విడుదలకానుంది. విశాల్–శేఖర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మిలట్రీ మాధవరం గ్రామంలో ఆదివారం విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేయడం వల్ల నేను తెలుసుకునన విషయం ఏంటంటే.. మా ఆంధ్రప్రదేశ్‌లో.. మా వెస్ట్‌గోదావరి జిల్లాలో.. మా ఊరి దగ్గర్లో మాధవరం అనే ఊరు ఉందనీ, జనాలు ‘మిలట్రీ మాధవరం’ అని పిలుస్తారని నాకు తెలియదు.
తెలుసుకున్నాక ఎంత కష్టమైనా ఈ ఫంక్షన్ ఇక్కడే చేద్దామనుకున్నాం.. చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. నన్ను నమ్మి అడిగిందల్లా ఇచ్చిన శ్రీధర్‌గారికి ధన్యవాదాలు. ఎప్పుటి నుంచో నాగబాబుగారికి సినిమా చేయాలనుకుంటున్నా. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేనెంత ఇబ్బంది పెడతానో నాకే తెలుసు. నా టార్చర్ భరించి నాతో సినిమా తీసినందుకు ‘బన్ని’ వాసుకి థ్యాంక్స్. మేం ఎంత మంది హీరోలున్నా అందరం మెగా కుటుంబమే. ‘రంగస్థలం’ హిట్ అయినందుకు రామ్‌చరణ్‌కి, యూనిట్‌కి కంగ్రాట్స్’’ అన్నారు.
చిత్ర సమర్పకులు నాగబాబు మాట్లాడుతూ– ‘‘ఒక మనిషి తెలివైనవాడా? గొప్పవాడా? అన్నది ముఖ్యం కాదు. ఎంత మంచివాడు.. ఎంత మంచి మనసు ఉన్నవాడు అన్నదే ముఖ్యం. అలాంటి వ్యక్తి ఎప్పటికైనా టాప్ రేంజ్‌కి వెళ్తాడు. బన్నీ అలాంటివాడే. మెగా హీరోలకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి చిరంజీవిగారు. థ్యాంక్స్ అన్నయ్యా.. మంచి జీవితం ఇచ్చావ్’’ అన్నారు. ‘‘మిలట్రీ మాధవరం సైనికులు దేశభక్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ చిత్రంలో ‘ఇరగ ఇరగ’ పాట ఉంది.
ఈ సినిమా చూశాక ఆల్మోస్ట్ జాతీయగీతంలా మీరు పాడుకుంటారని అనుకుంటున్నా. వంశీ రాబోయే కాలంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అవుతాడు’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ‘‘మిలట్రీ మాధవరం లాంటి ఊరు ఉన్న తెలుగు గడ్డపై ఓ తెలుగు వాడిగా నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. చాలా సినిమాలకు రైటర్‌గా పనిచేసినా దర్శకునిగా మొదటి సినిమా. నా మూడున్నరేళ్ల కలని తీర్చిన మగాడు అల్లు అర్జున్. నాలో రచయితని మాత్రమే కాదు.. డైరెక్టర్ ఉన్నాడని నమ్మాడు. నాకు తెలిసి ఏ కొత్త డైరెక్టర్‌కి ఇంత అదృష్టం పట్టి ఉండదు.
ఓ పది సినిమాల సూపర్‌హిట్ డైరెక్టర్‌తో పనిచేస్తే ఎలా ఉంటాడో ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌తో కూడా అలాగే ఉన్నాడాయన. సూర్య పాత్ర కనీసం ఓ పదేళ్లు మీ గుండెల్లో నిలిచిపోతుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. గొప్ప సినిమా చూశామని తలెత్తుకుని థియేటర్ల నుంచి బయటికెళతారని చెప్పగలను’’ అన్నారు. అనంతరం మిలట్రీ మాధవరంలోని వీర జవానుల భార్యలకు సత్కారం చేశారు. సహ నిర్మాత ‘బన్ని’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment