
వాళ్లే రియల్ హీరోస్ : అల్లు శిరీష్
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో కెరీర్లో తొలి హిట్ అందుకున్న మెగా హీరో అల్లు శిరీష్.., ప్రస్తుతం తన మాలీవుడ్కి రెడీ అవుతున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటికే అల్లు అర్జున్కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో అది కూడా శిరీష్ ఎంట్రీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే మాలీవుడ్లో తొలి సినిమా సోలో హీరోగా కాకుండా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కీలక పాత్రలో చేస్తున్నాడు. 1971 నాటి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిరీష్ సైనికుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సమయంలో సైన్యం గురించి, యుద్ధం గురించి ఎంతో తెలుసుకున్నానన్న శిరీష్. 'మనదేశం, సైనికులకు ఎంతో రుణపడి ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో, పెద్దగా సౌకర్యాలు లేని దగ్గర, వ్యక్తిగత జీవితాన్ని కూడా కాదనుకొని.. దేశం కోసం పనిచేసే వారు నిజమైన హీరోలు' అంటూ తన ట్విట్టర్ పేజ్ లో కామెంట్ చేశాడు. అంతేకాదు.. అన్న అల్లు అర్జున్కు కూతురు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికి తన కృతజ్ఞతలు తెలియజేశాడు శిరీష్.