
ముంబై: అర్థనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రీరెడ్డి ఉదంతంపై బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్‌ను ఆమె సమర్థించారు. దానివల్ల కొందరికి కనీసం తిండి దొరుకుతుందని అన్నారు. అయితే, ఇలాంటి వ్యవహారలకు సిద్ధపడాలా, వద్దా అనే నిర్ణయం పూర్తిగా అమ్మాయిలదేనని అభిప్రాయపడ్డారు. సోమవారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ‘శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన’పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ విధింగా బదులిచ్చారు.
రేప్‌చేసి వదిలేయట్లేదు కదా: ‘‘ఒక్క సినిమా రంగంలోనే కాస్టింగ్ కౌచ్ జరుగుతున్నదని గగ్గోలు పెట్టడం సరికాదు. బయట అన్ని రంగాల్లోనూ మహిళలు ఇలాంటి సమస్యలు ఎదురుర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖల్లోనూ వేధింపుల ఉదంతాలు ఉన్నాయికదా! మీరంతా(మీడియా) సినిమావాళ్ల వెంటే ఎందుకు పరుగెత్తుతారు? ఇక్కడ(సినిమా రంగంలో) రేప్‌లు చేసే మగవాళ్లు వారిని(బాధితురాళ్లని) ఊరికే వదిలేయరు. అలా కనీసం కొందరికైనా తిండి దొరుకుతున్నదని మర్చిపోవద్దు..
అమ్ముడుపోవాల్సిన అవసరమేంటి?: కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో అమ్మాయిల నిర్ణయమే కీలకం. వేషాల కోసం మనం ఒకరికి అమ్ముడుపోవాలా, ఒకరిచేతుల్లో బందీకావాలా అని ఎవరికివారే ఆలోచించుకోవాలి. నిజంగా మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు అలాంటివాటికి ఎందుకు ఒప్పుకోవాలి? మళ్లీ చెబుతున్నా.. ఇది ఒక్క సినిమా రంగానికే సంబంధించిన వ్యవహారమే కాదు యావత్ సమాజానికి సంబంధించింది’’ అని సరోజ్ ఖాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment