కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక దోపిడీ(కాస్టింగ్ కౌచ్) ఏదో ఒక రంగానికి పరిమితం కాలేదని, పార్లమెంటూ దానికి మినహాయింపు కాదని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మాదిరిగా ‘మీ టూ’ అని ఇండియా కూడా నినదించాల్సిన సమయం వచ్చిందన్నారు. బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌కు మద్దతుగా నిలవడంపై రేణుక మంగళవారం ఉదయం పై విధంగా స్పందించారు.
అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సాయంత్రం వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తనని అవమానించడం కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుందని పేర్కొన్నారు. ‘కాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు పరిమితం కాలేదనేది ఒక చేదు నిజం. అన్ని పని ప్రదేశాల్లోనూ ఇది సాధారణమే. పార్లమెంటు కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు అని భావించొద్దు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటీమణులు కాస్టింగ్ కౌచ్‌పై ‘మీ టూ’ అంటూ తమపై జరిగిన అఘాయిత్యాలను బహిర్గతం చేస్తున్నారు. భారత్‌లో కూడా బాధితులు అలాగే గొంతెత్తాలి’ అని అన్నారు.
పార్లమెంటులో కాస్టింగ్ కౌచ్ ఉందనడం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో రేణుక తిరిగి సాయంత్రం వివరణ ఇచ్చారు. ‘గత పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ సభ్యురాలైన నన్ను ప్రధాని నరేంద్ర మోదీ శూర్పణఖతో పోల్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నా గౌరవానికి భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఒక మహిళగా నా హక్కులు, గౌరవానికి భంగం కలిగించారు కాబట్టి ఇది కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుంది’ అని రేణుక వివరణ ఇచ్చారు.
వారికి ఉపాధి దొరుకుతోంది: సరోజ్‌ఖాన్
కాస్టింగ్ కౌచ్‌ను సరోజ్‌ఖాన్ వెనకేసుకొచ్చారు. మహిళలతో లైంగిక కోరికలు తీర్చుకున్న తరువాత వారిని సినీ పరిశ్రమ గాలికొదిలేయకుండా కనీసం జీవనోపాధి కల్పిస్తోందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా నిరసనకు దిగడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరోజ్ అలా స్పందించారు.
‘కాస్టింగ్ కౌచ్ చాలా ఏళ్లుగా ఉంది. మహిళతో పడక పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వారూ అందుకు మినహాయింపు కాదు. కేవలం సినీ పరిశ్రమనే ఎందుకు నిందిస్తారు? అది కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది కదా. మహిళలను వాడుకొని అలా వదిలేయట్లేదు కదా’ అని అన్నారు. ఆ తరువాత సరోజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి క్షమాపణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment