
జూన్‌లో దిలీప్ సాబ్ ఆత్మకథ
హిందీ చిత్రసీమకు పెద్ద దిక్కులాంటివారు దిలీప్‌కుమార్. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన కథానాయకుడాయన. ముఖ్యంగా విషాదాంత ప్రేమకథలపై చెక్కుచెదరని ముద్ర వేశారాయన. అందుకే ఆయన్ని ‘ట్రాజెడీ కింగ్’ అంటారు. ఇటీవలే ఈ బాలీవుడ్ లెజెండ్ 91వ పుట్టినరోజు జరుపుకున్నారు. దిలీప్ వ్యక్తిగత, వృత్తిజీవితం గురించి తెలుసుకోవాలని ఈ తరం వారికీ ఆసక్తి ఉంది. అయితే పూర్తి స్థాయి సమాచారం దొరకడంలేదు. ఆ లోటు త్వరలోనే నెరవేరనుంది. దిలీప్‌కుమార్ ఆత్మకథతో ‘సబ్‌స్టన్స్ అండ్ ది షాడో’ పేరుతో ఓ పుస్తకం తయారయ్యింది. సబ్‌స్టన్స్ అంటే సారాంశం, పదార్థం, సారం.. ఇలా పలు అర్థాలు వస్తాయి.
దిలీప్ అసలు పేరు యూసుఫ్‌ఖాన్‌ని ఉద్దేశించి సబ్‌స్టన్స్ అని, ది షాడో అంటే దిలీప్‌కుమార్ అనే వెండితెర పేరును ఉద్దేశించి పెట్టినదని సమాచారం. సహనటీనటులతో తన అనుబంధం, రాజ్‌కపూర్, దేవానంద్ లాంటి నటులతో ఉన్న వైరం.. ఇలా పలు విషయాలను స్వయంగా దిలీప్‌కుమార్ చెప్పగా, రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. మధుబాలతో తన అనుబంధం గురించి కూడా దిలీప్ అందులో చెప్పారట. జూన్ 9న అమితాబ్‌బచ్చన్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. దిలీప్‌కుమార్ సతీమణి, నటి సైరాభాను పరిశ్రమ ప్రముఖులకు స్వయంగా ఫోన్ చేసి, ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. దిలీప్‌సాబ్ జీవితంలోనే అత్యంత ఘనమైన వేడుకలా చేయాలనే ఆకాంక్షతో సైరాభాను ఉన్నారట!