
శివ, ఆమని, చినమారయ్య
‘‘ఒక తల్లి ఎంత బాధ్యతగా ఉండాలో ‘అమ్మదీవెన’ సినిమాలో చూపించాం. ఓ తాగుబోతు మొగుడి వల్ల ఐదుగురు పిల్లలున్న ఓ భార్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అన్నదే మా చిత్ర కథాంశం’’ అని నటి ఆమని అన్నారు. శివ ఏటూరి దర్శకత్వంలో ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మదీవెన’. ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఆమని మాట్లాడుతూ– ‘‘శుభసంకల్పం’ తర్వాత ‘అమ్మదీవెన’ సినిమాలోనే డీ–గ్లామరస్ పాత్రలో నటించాను’’ అన్నారు. ‘‘‘అమ్మదీవెన’ ఎప్పుడూ తక్కువ కాదు’’ అన్నారు రాజయ్య. ‘‘తల్లి దీవెనలు ఉంటే మనం ఎప్పుడూ పైచేయి సాధిస్తాం’’ అన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ‘‘టైటిల్ చూస్తే ‘మాతృదేవోభవ’ సినిమా గుర్తొస్తోంది’’ అన్నారు నిర్మాత డీఎస్ రావు. ‘‘ఈ నెలలో ఆడియోను, త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అన్నారు శివ ఏటూరి.