ఈ విజయం నా బాధ్యతను పెంచింది - సుమంత్ అశ్విన్
ఈ విజయం నా బాధ్యతను పెంచింది - సుమంత్ అశ్విన్
Published Tue, Aug 27 2013 1:27 AM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM
‘‘ఒక సినిమా విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది. ఈ సినిమా విజయం ఆనందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చింది’’ అంటున్నారు సుమంత్ అశ్విన్. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, ఇషా జంటగా దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించడం ఖాయం అని నిర్మాణంలో ఉన్నప్పుడు సుమంత్ అశ్విన్ నమ్మకం వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఆ నమ్మకం నిజమైందని పేర్కొన్న సుమంత్ అశ్విన్ పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ విధంగా స్పందించారు.
**** ఈ సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది?
నిజం చెప్పాలంటే కొంచెం టెన్షన్‌గా ఉంది. సక్సెస్ అయిందనే ఆనందం ఒకవైపు ఉన్నా, తదుపరి సినిమాపై అంచనాలు ఏర్పడుతాయి కాబట్టి... ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను. ఈ విజయం నా బాధ్యతను పెంచింది. తదుపరి చిత్రాల విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకుని, ఆ చిత్రాల్లోని పాత్రలకు కూడా పూర్తి న్యాయం చేయాలనుకుంటున్నాను.
**** ఈ సినిమాని మీ నాన్నగారు (ఎమ్మెస్‌రాజు) చూశారా.. ఆయన కూడా దర్శక, నిర్మాతే కాబట్టి ఏమైనా ఇన్‌వాల్వ్ అయ్యారా?
ఈ సినిమాకి దాముగారు, మోహన్‌కృష్ణగారు నన్నడిగినప్పుడు.. నాన్నగారు ఒకటే అన్నారు. ‘మంచి యూనిట్‌తో సినిమా చేయబోతున్నావ్. తప్పకుండా ఓ సక్సెస్‌ఫుల్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ బృందం మీద ఆయనకంత నమ్మకం ఉంది. అందుకే ఇన్‌వాల్వ్ అవ్వలేదు. ఈ సినిమా విజయం సాధించినందుకు ఎక్కువగా ఆనందపడింది నాన్నగారే. ఇటీవలి కాలంలో ఆయనకు దాదాపు ఏ సినిమా నచ్చలేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత, పరిపూర్ణంగా ఉందన్నారు. బాగా యాక్ట్ చేశానని మెచ్చుకున్నారు.
**** ముందుగా సక్సెస్ గురించి ఎవరి ద్వారా విన్నారు?
యూఎస్ నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి, చాలా బాగుందన్నారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే రెండో రోజు వేరే రకంగా చెబితే, నిరుత్సాహపడిపోతాను. అందుకే రెండు, మూడో రోజు రిజల్ట్ కోసం వెయిట్ చేశాను. వసూళ్లు బాగున్నాయని తెలుసుకున్న తర్వాత అప్పుడు నమ్మకం కుదిరింది.
**** వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా చేశారు కాబట్టి.. రిస్క్ అవుతుందేమో అనిపించిందా?
తెలుగు సినిమా అంటే ఇలా ఉండాలి అని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని ఫాలో అవ్వకుండా తీసిన ‘కాన్సెప్ట్ ఓరియంటెడ్’ మూవీ ఇది. కొంచెం రిస్క్ లేకపోలేదు. కానీ దాముగారు, ఇంద్రగంటి గారు, మేమందరం కథని నమ్మి ఈ సినిమా చేశాం. ఆ కథను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. వాస్తవానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘తెలుగు ప్రేక్షకులు కొత్త కథలను అంగీకరిస్తారు. చాలా ఇంటలెక్చువల్’ అని ఇంద్రగంటిగారు అనేవారు. ఆయన నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నిర్మాణ సమయంలో ‘ఒకవేళ ఈ సినిమా ఆడకపోయినా సరే.. మంచి సినిమా చేశాననే తృప్తి మిగులుతుంది’ అని ఇంద్రగంటిగారితో అన్నాను.
**** సీమాంధ్రలో ఈ సినిమా పరిస్థితి ఏంటి?
మంచి వసూళ్లనే రాబడుతోంది. తిరుపతిలో శుక్ర, శని, ఆదివారాలకన్నా ఈరోజు (సోమవారం) వసూళ్లు ఇంకా బాగున్నాయి. కుటుంబ సమేతంగా సినిమా చూస్తున్నారు.
**** తదుపరి కూడా మీరిలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే చేస్తారా?
తప్పకుండా. యూత్‌ఫుల్ మూవీస్ అయినప్పటికీ కుటుంబ సమే తంగా చూసేట్లు జాగ్రత్తలు తీసుకుంటా.
**** ఓ నిర్మాత, దర్శకుడి కొడుకుగా నిర్మాణంలో ఉండే ఇబ్బందులు మీకు తెలిసే ఉంటాయి కాబట్టి.. మీరెలాంటి సహకారం అందిస్తారు?
షూటింగ్ ఏడుకి అంటే.. ఠంచనుగా హాజరైపోతాను. ఎందుకంటే గంట ఆలస్యం అయితే లక్షల రూపాయలు వృథా అవుతాయి. నా కారణంగా షూటింగ్‌కి ఆటంకం కలగకుండా చూసుకుంటాను.
**** ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి?
‘లవర్స్’ చేస్తున్నాను. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Advertisement
Advertisement