
అనుపమ్ ఖేర్... ది బిగ్ సిక్!
నటుడిగా 32 ఏళ్లు... 499 సినిమాలు. హిందీ నటుడు అనుపమ్ ఖేర్ కెరీర్ రికార్డ్ ఇది. 99వ సినిమా చేసి, నూరో చిత్రంలో నటించినప్పుడు అనుపమ్‌కు దక్కిన ఆనందం అంతా ఇంతా కాదు. తొలి సెంచరీ పూర్తి చేశాక ఆనందంగా మలి సెంచరీని టార్గెట్ చేశారు. 200, 300, 400.. ఇలా సెంచరీల మీద సెంచరీలు సాధించారు.
ఇప్పుడు అందరి దృష్టీ అనుపమ్ నటించనున్న 500వ సినిమాపై ఉంది. అయిదు వందలు సినిమాలకు చేరుకోవడం అంటే మాటలు కాదు. అందుకే అనుపమ్‌ని బంపర్ ఆఫర్ వరిస్తే బాగుంటుందని ఆయన శ్రేయోభిలాషులు ఆశించారు. వారి ఆశ ఫలించింది. ‘ది బిగ్ సిక్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ‘‘నా 500వ సినిమాగా ‘ది బిగ్ సిక్’ చేయబోతున్నా.
ఈ సినిమాలో హాలీవుడ్ నటులు హాలీ హంటర్, రే రొమానొ, జో కజాన్ తదితరులతో కలిసి నటించబోతున్నా’’ అని అనుపమ్ పేర్కొన్నారు. ‘‘బెండ్ ఇట్ లైక్ బెకమ్’, ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’, ‘ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్’ తదితర అంతర్జాతీయ చిత్రాల్లో నటించారాయన. ఇప్పుడు పూర్తి స్థాయి హాలీవుడ్ మూవీలో చేయనున్నారు. ఈ విషయం గురించి అనుపమ్ చెబుతూ - ‘‘నా 500వ సినిమా హాలీవుడ్‌కి చెందినది కావడం ఆనందంగా ఉంది. హిందీ సినిమా అయితే ఆనందపడి ఉండేవాణ్ణి కాదనడంలేదు.
హిందీలో చాలా చేసేశాను. ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్న సమయంలో ‘ది బిగ్ సిక్’కి అవకాశం వచ్చింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు. అనుపమ్ ఐదు సెంచరీలు సాధించడం పట్ల పలువురు హిందీ తారలు, హాలీవుడ్ తారలు ఆయన్ను అభినందించారు. 72 ఏళ్ల హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో అయితే ‘‘అమెరికాలో నేనిప్పటికి 95 సినిమాలు మాత్రమే చేయగలిగాను. మీరు అయిదు వందల చిత్రాల్లో నటించగలిగారు. ఇది నిజంగా అద్భుతం’’ అని 61 ఏళ్ల అనుపమ్‌ని ప్రశంసించారు.