బాలీవుడ్ నటుడికి వీసా నిరాకరించిన పాక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్లోనూ అసహనం ఉందా? 18 మంది ఆహూతుల్లో 17 మందికి వీసాలు ఇచ్చి ఒక్కరికే ఇవ్వకపోవడం దేనికి సంకేతం? బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్కు వీసా మంజూరు చేసేందుకు పాక్ ప్రభుత్వం నిరాకరించింది. భారత్లో అసహనం పెరిగిపోతోందని సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి వ్యతిరేకంగా ఖేర్ గళం విప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు పాక్ వీసా ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ నెల 5న కరాచీ సాహిత్య సమ్మేళనంలో ఖేర్ పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి 18 మంది విదేశీ ప్రముఖులను ఆహ్వానించారు. ఖర్కు మినహా మిగిలిన ప్రముఖులకు పాక్ వీసాలు మంజూరు చేసింది. దీనిపై ఖేర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పాక్ వీసా నిరాకరించడం బాధ కలిగించిందని చెప్పారు. అనుపమ్ ఖేర్కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.