
అనుపమా పరమేశ్వరన్
‘‘నా అభిమాన హీరో చిరంజీవి. ఆయన గొప్ప నటుడు.. చాన్స్ వస్తే చిరంజీవిగారితో అర నిమిషమైనా నటిస్తే నా జన్మ ధన్యమైనట్లే’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ అన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న అనుపమ శనివారం విజయవాడలో జరిగిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘తేజ్ ఐలవ్ యూ’ మంచి లవ్‌స్టోరీ. ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంటుంది. నేను నటించిన ‘అ..ఆ’ చిత్ర విజయోత్సవం గుంటూరులో జరిగింది.
అప్పుడే విజయవాడ గురించి, ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయం గురించి తెలుసుకున్నాను. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉంది. నా అభిమాన నటి నిత్యామీనన్. సావిత్రిగారు గొప్ప నటి. ఆమె గురించి ఇటీవలే ‘మహానటి’ సినిమా చూసి తెలుసుకున్నాను. ప్రస్తుతం ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు బాగానే ఉన్నాయి. నా వరకూ బాగానే ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. రామ్ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తున్నాను. నటిగా మంచి గుర్తింపు పొందాలనేది నా ఆకాంక్ష. ముందు తెలుగు మాట్లాడటం రాక ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment