
తనుశ్రీ దత్తా ఆరోపణల్లో నిజం ఉండే ఉంటుందన్న అనుష్క శర్మ
న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా- నానా పటేకర్ వివాదంలో తనుశ్రీ దత్తాకు బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్‌లు బాసటగా నిలిచారు. వారి వాదనను, వారు ఎదుర్కొన్న వేదనను సమాజం ముందుకు తెచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వ్యక్తుల మనోభావాలను మనం అర్థం చేసుకోవాలని అనుష్క శర్మ అన్నారు. సుయిధాగా మూవీ మీడియా మీట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు అనుష్క బదులిస్తూ తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ ధైర్యంగా ముందకొచ్చి మాట్లాడటం నిజంగా సాహసమని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా దీని వెనుక నిజం ఉండి ఉంటుందని చెప్పుకొచ్చారు.
తనుశ్రీ వ్యాఖ్యలపై కామెంట్ చేయడం, ఆమె వ్యక్తిత్వంపై భాష్యాలు చెప్పడం కంటే ఆమె చెబుతున్నది వినాలని, అర్ధం చేసుకోవాలని అనుష్క పేర్కొన్నారు. తనుశ్రీకి న్యాయం జరిగే వరకూ తాను ఆమె వెంట ఉంటానని అన్నారు. ఇక వరుణ్ ధావన్ సైతం తనుశ్రీ దత్తాకు మద్దతుగా మాట్లాడారు. తన సినిమా సెట్‌లో ఇలాంటివి జరిగితే తాను బాధితుల పక్షాన ముందుకొచ్చేవాడినన్నారు. తనుశ్రీ లేవనెత్తిన విషయాలపై విచారణలో వాస్తవాలు నిగ్గుతేలతాయన్నారు. కాగా 2008లో ఓ సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే.