‘‘కమర్షియల్ సినిమాల్లో కూడా అంతర్లీనంగా ఓ సందేశం ఇస్తే ప్రేక్షకులకు తప్పకుండా చేరుతుంది. అదే సందేశం మాత్రమే ఇవ్వాలని సినిమా తీస్తే ప్రయోజనం ఉండదు. ఓ పెద్ద హీరో సినిమా ద్వారా సందేశం ఇస్తే ప్రేక్షకులందరికీ సులభంగా చేరుతుంది’’ అన్నారు ఏఆర్ మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మురుగదాస్ చెప్పిన ముచ్చట్లు...
♦ ఒకప్పుడు దేవుడంటే భయపడేవాళ్లు... ఇప్పుడు సీక్రెట్ కెమెరా అంటే భయపడుతున్నారు. మన లైఫ్‌లో సీక్రెట్ అనేది ఏదీ ఉండడం లేదు. ఏదైనా మర్డర్ జరిగితే సీక్రెట్ కెమెరాతో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టొచ్చు. ఐబి (ఇంటిలిజెన్స్ బ్యూరో) వాళ్లు చేసేదదే! దానిపైనే ‘స్పైడర్’ సినిమా ఉంటుంది. ∙
♦ 20 ఏళ్ల క్రితం ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అందరూ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చేవారు. ఇప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నారు. మానవత్వం ఎక్కడా కనిపించడం లేదు. పెద్ద విపత్తులు, ఘోరాలు (డిజాస్టర్స్) జరిగినప్పుడు మాత్రమే మానవత్వం అనేది బయటకొస్తుంది. విపత్తుల కోసం మనం వెయిట్ చేయకూడదు, అందరికీ హెల్ప్ చేయాలనే సందేశాన్ని అంతర్లీనంగా ‘స్పైడర్’లో చెప్పా.
♦ ఇందులో మహేశ్ ఐబి ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆయన సూపర్‌హిట్ సిన్మాలన్నీ చూశా. స్క్రిప్ట్‌కి, క్యారెక్టర్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌లో 100 పర్సెంట్ డిఫరెన్స్ చూపిస్తారు. ‘స్పైడర్’లో సరికొత్త మహేశ్‌ని చూస్తారు. ఇంతకు ముందు ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు. హీరో బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్ తదితర అంశాల్లో మహేశ్‌దీ, నాదీ సేమ్ టేస్ట్. ఫైట్స్ అనగానే గాల్లో ఎగరకూడదు, సహజత్వంగా ఉండాలనేది మా ఫీలింగ్. ఈ ‘స్పైడర్’ కూడా సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా.
♦ తెలుగుతో పాటు తమిళ్ వెర్షన్‌లోనూ సినిమా కథంతా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుంది. కథలో జాగ్రఫీకి ఇంపార్టెన్స్ ఉంది. తెలుగు, తమిళ్ వెర్షన్స్‌కి రీ–రికార్డింగ్‌లో కొంచెం తేడా ఉంటుందంతే. ఇక్కడ మహేశ్ సూపర్‌స్టార్ కాబట్టి ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా, తమిళంలో కొత్త హీరో కాబట్టి, ఆ అంశాన్ని దృష్టిల్లో పెట్టుకుని రీ–రికార్డింగ్ చేశాం. ∙
♦ భారతంలో శకునిలా, హీరోని సైకలాజికల్‌గా దెబ్బతీసే విలన్ పాత్రలో ఎస్.జె. సూర్య నటన సూపర్బ్. హీరోకి, విలన్‌కి మధ్య మైండ్‌గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ లేడీస్‌తో కలసి విలన్‌ని హీరో ఎలా పట్టుకున్నాడనే 20 మినిట్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. రాక్ ఎపిసోడ్ (పెద్ద బండరాయి దొర్లుతూ వచ్చే సీన్), రోలర్ కోస్టర్ ఫైట్ ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి.
♦ ప్రభాస్‌తో ఫ్రెండ్లీగా ఫోనులో మాట్లాడా తప్ప ఏ సినిమా గురించీ డిస్కస్ చేయలేదు. నేరుగా కలవలేదు. రజనీకాంత్‌గారిని రెండు మూడుసార్లు కలిసి, కథ చెప్పా. డేట్స్ కుదరలేదు. త్వరలో మా కాంబినేషన్‌లో సినిమా ఉండొచ్చు!!