
అఖిల్ కోసం ఆస్కార్ విజేత
అక్కినేని నటవారసుడు అఖిల్ రెండో సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలి. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు అఖిల్. అందుకు తగ్గట్టుగా సినిమా కథా కథనాలతో పాటు నటీనటులు సాంకేతిక నిపుణుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు ను కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారన్న వార్త వినిపిస్తుంది. ఇప్పుడు సంగీత దర్శకుడిగా ఓ స్టార్ మ్యూజిషియన్ తీసుకోవాలని భావిస్తున్నారట.
అఖిల్ రెండో సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ నెలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. జనవరిలో రెగ్యులర్ షూట్ మొదలవుతోంది. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. నాగచైతన్య హీరోగా తెరకెక్కి, రెహమాన్ సంగీతం అందించిన ఏం మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అదే సెంటిమెంట్ తో అఖిల్ రెండో సినిమాకు కూడా రెహమాన్ ప్లస్ అవుతాడని భావిస్తున్నారు. మరి రెహమాన్ మ్యూజిక్ అఖిల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి.