Arjun Suravaram Review, in Telugu | Rating {2.75/5} | అర్జున్‌ సురవరం మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

అర్జున్‌ సురవరం : మూవీ రివ్యూ

Published Fri, Nov 29 2019 12:46 PM | Last Updated on Fri, Nov 29 2019 3:29 PM

Arjun Suravaram Movie Review And Rating in Telugu - Sakshi

టైటిల్‌: అర్జున్‌ సురవరం
నటీనటులు: నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్‌ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌
దర్శకత్వం: టీఎన్‌ సంతోష్‌
సంగీతం: సామ్‌ సీ.ఎస్‌
సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
బ్యానర్‌:  మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పీ

మొదటినుంచీ డిఫరెంట్‌ సినిమాలతో టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌. హ్యాపీడేస్‌ నుంచి మంచి కథలతో ఎంచుకుంటూ ప్రతి సినిమాకీ తన గ్రాఫ్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్‌ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం అర్జున్‌ సురవరం. తమిళ సూపర్‌హిట్‌ ‘కణితన్‌’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్‌ జర్నలిస్ట్‌గా నటించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌తోపాటు ఇప్పటివరకు రిలీజైన పాటలు మంచి క్రేజ్‌తెచ్చాయి. ఇంతకు రిపోర్టర్‌ అర్జున్‌ సురవరం ఎలా రిపోర్ట్‌ చేశాడు? ఏ స్కామ్‌ను బయటపెట్టాడు? తెలుసుకుందాం పదండి.

కథ:
అర్జున్‌ లెనిన్‌ సురవరం (నిఖిల్‌).. తండ్రికి కూడా చెప్పకుండా సాప్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి జర్నలిజంపై మక్కువతో ఓ టీవీ చానెల్‌లో రిపోర్టర్‌గా చేరుతాడు. బీబీసీలో పనిచేయాలన్నది అతని కల. ఈ విషయమై కావ్య (లావణ్య త్రిపాఠి)కు అబద్ధం చెప్తాడు. కానీ, కావ్య అర్జున్‌ పనిచేస్తున్న టీవీ చానెల్‌ సీఈవో కూతురు కావడంతో నిజం వెంటనే బయటపడుతుంది. మొదట అబద్ధం చెప్పాడని అర్జున్‌ గురించి నెగిటివ్‌గా థింక్‌ చేసినా.. బాధ్యతాయుతమైన రిపోర్టర్‌గా అతను పనిచేస్తున్న తీరును గుర్తించి.. బీబీసీలో ఉద్యోగం కోసం కావ్యనే అర్జున్‌ అప్లికేషన్‌ పంపుతుంది. అర్జున్‌కు బీబీసీలో ఉద్యోగం వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌, కావ్య మధ్య ప్రేమ చిగురిస్తుంది. కావ్యకు అర్జున్‌ ప్రేమ వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు హఠాత్తుగా వచ్చి అర్జున్‌ను అరెస్టు చేస్తారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. అర్జున్‌తోపాటు ఇతర నిందితులకు కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. కానీ ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో బెయిల్‌పైన బయటకు వచ్చిన అర్జున్‌ సురవరం ఫేక్‌ సర్టిఫికెట్స్‌, ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ రాకెట్‌ను ఎలా వెంటాడుతాడా? నకిలీ సర్టిఫికెట్లతో సమాజానికి ఎంతో చేటు చేస్తున్న ఎంతోమందిని బయటపెట్టి.. అతి పెద్ద స్కాంను, దాని సూత్రధారిని ఎలా పట్టించడాన్నది మిగతా కథ.

విశ్లేషణ:
ఫేక్‌ సర్టిఫికెట్స్‌తో సమాజానికి పెనుసవాలుగా నిలిచిన ఓ భారీ నెట్‌వర్క్‌ను, వ్యవస్థతో మమైకమై అతిపెద్ద స్కాంను ఓ రిపోర్టర్‌ ఎలా వెలుగులోకి తీసుకొచ్చడన్నది అర్జున్‌ సురవరం కథ. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ఈ సినిమా పవర్‌ఫుల్‌ కథతో తెరకెక్కింది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ వల్ల చదువుకున్న నిరుద్యోగులు మోసపోవడమే కాదు.. తప్పుడు పత్రాలతో డాక్టర్లు, ఇంజినీర్లు అయిన వాళ్లు సమాజానికి ఎలా ముప్పుగా మారుతున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. తమిళ రీమేక్‌ అయిన ఆ భావన రాకుండా పూర్తి తెలుగు నేటివిటీతో అర్జున్‌ సురవరంను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్‌ కథనంతో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్‌లోనే కథ కొంచెం నెమ్మదించింది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు హీరో ప్రయత్నించడం.. తన లోగుట్టును బయటకు లాగుతున్న హీరోను తెలుసుకునేందుకు విలన్‌ వెంటాడటం సెంకడాఫ్‌లో ప్రధానంగా కనిపిస్తుంది. ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్‌ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను నిలబెట్టేలా బావున్నాయి.  ఎమోషనల్‌ సీన్లను దర్శకుడు బాగా  చిత్రీకరించాడు. కానిస్టేబుల్‌ సుబ్బారావు (పోసాని కృష్ణమురళీ) చనిపోయిన సీన్‌లో అతని కొడుకు (వెన్నెల కిషోర్‌) భావోద్వేగాలు.. ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా పండాయి. డైలాగులు బావున్నాయి. పాటలు అంతంతమాత్రం ఉండగా.. నేపథ్య సంగీతం చాలావరకు రణగొణ ధ్వనులతో సీన్లకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.

నిఖిల్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరివరకు సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట క్లైమాక్స్‌ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్‌ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి హాస్యాన్ని పంచాడు. విలన్‌ పాత్రలో తరుణ్‌ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు.

బలాలు
పవర్‌ఫుల్‌ కథ
ప్రీక్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్టులు
ఏమోషనల్‌ సీన్స్‌

బలహీనతలు
సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం
అక్కడక్కడ ఓవర్‌ సినిమాటిక్‌గా ఉండటం
నేపథ్య సంగీతం అంత ఆప్ట్‌గా లేకపోవడం

- శ్రీకాంత్‌ కాంటేకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement