Sathi Gani Rendu Ekaralu Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Sathi Gani Rendu Ekaralu: ఆహాలో 'సత్తిగాని రెండెకరాలు' మూవీ రివ్యూ

Published Fri, May 26 2023 2:12 PM | Last Updated on Fri, May 26 2023 3:04 PM

Sathi Gani Rendu Ekaralu Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: సత్తిగాని రెండెకరాలు
నటీనటులు: జగదీష్‌ ప్రతాప్‌ బండారి, వెన్నెల కిశోర్‌, మోహన శ్రీ, రాజ్‌ తిరందాసు, అనీషా దామా, బిత్తిరి సత్తి, మురళీదర్‌ గౌడ్‌, రియాజ్‌ తదితరులు
రచన, దర్శకత్వం: అభినవ్‌ రెడ్డి దండ
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్‌ రెడ్డి సీహెచ్‌
సంగీతం: జై క్రిష్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌
విడుదల తేదీ: మే 26, 2023
ఓటీటీ వేదిక: ఆహా

పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్‌ ప్రతాప్‌ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్‌ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్‌. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ
కొల్లూరు అనే గ్రామంలో నివసించే సత్తి(జగదీష్‌ ప్రతాప్‌ బండారి)కి భార్య, ఇద్దరు పిల్లలు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఎంత కష్టం వచ్చినా సరే ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని సత్తికి చిన్నప్పుడే అతడి తాత చెప్తాడు. మీ నాన్న ఉన్నదంతా అమ్మేసి చివరకు రెండు ఎకారలు మాత్రమే మిగిల్చాడని దాన్ని కాపాడుకోమని సెలవిస్తాడు. ఆ మాటలను బుర్రకు ఎక్కించుకుంటాడు సత్తి. పెద్దయ్యాక అతడికో పెద్ద కష్టం వస్తుంది. తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్‌ చేయడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్‌ చెప్తారు. అప్పటికే సమయం కోసం వేచి చూస్తున్న సత్తి బంధువు, ఊరి సర్పంచ్‌ తన స్వలాభం కోసం సత్తితో రెండెకరాలు అమ్మించేయాలని కుట్ర పన్నుతాడు.

ఓ రోజు సత్తి సైకిల్‌ మీద వెళ్తుండగా అక్కడ ఓ కారు చెట్టును ఢీ కొడుతుంది. అందులో వ్యక్తికి తీవ్ర గాయాలైనా పట్టించుకోని సత్తి ఆ కారులో ఉన్న సూట్‌కేసును మాత్రం ఇంటికి తీసుకొస్తాడు. అందులో డబ్బులుంటే కూతురికి ఆపరేషన్‌ చేయించవచ్చని అతడి ఐడియా. కానీ ఆ సూట్‌కేస్‌ ఎలా తెరవాలో తెలియక స్నేహితుడు అంజి(రాజ్‌ తిరందాసు) సాయం కోరుతాడు. వీళ్లు అప్పటికే ఊర్లో చిన్నచిన్న దొంగతనాలు చేయడంతో దాన్ని ఎలాగైనా ఓపెన్‌ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు.

మరోవైపు సూట్‌కేస్‌ ఓనర్‌ లలిత్‌(రియాజ్‌) తన అనుచరుడు వెన్నెల కిశోర్‌ను యాక్సిడెంట్‌ అయిన ప్రదేశానికి పంపిస్తాడు. అతడు కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తిని కూడా కాల్చేసి సూట్‌కేసు కోసం గాలిస్తాడు. మరోపక్క కారు ప్రమాదం గురించి ఎస్సై(బిత్తిరి సత్తి) విచారణ చేస్తూ ఉంటాడు. తీరా ఒక రోజు సూట్‌కేస్‌ తెరుచుకుంటుంది. అందులో ఏముంది? వెన్నెల కిశోర్‌ ఆ సూట్‌కేస్‌ సొంతం చేసుకున్నాడా? ఎస్సై విచారణ ఎలా సాగింది? సత్తి తన కూతురికి ఆపరేషన్‌ చేయించాడా? అన్నది మిగతా కథ.

విశ్లేషణ
ఈ మధ్యకాలంలో ప్రాంతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో సత్తిగాని రెండెకరాలు కూడా వచ్చింది. ఈ సినిమాను కామెడీగా లేదంటే క్రైమ్‌ థ్రిల్లర్‌ తరహాలో తీయవచ్చు. కానీ దర్శకుడు అభినవ్‌ రెడ్డి దండ కామెడీకే జై కొట్టారు. అయితే సత్తిగాని రెండెకరాలు కథలో కొత్తదనం లేదు. కాకపోతే అల్లుకున్న క్యారెక్టర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.

సూట్‌కేసు వచ్చిన తర్వాత సినిమాలో వేగం, బలం పుంజుకుంటుంది. క్లైమాక్స్‌ బాగుంది. ఎంత మంచివాడైనా కొన్ని సందర్భాల్లో చెడువైపు అడుగులు వేసేందుకు ఆస్కారం ఉంది. అవసరం మనతో ఏ పనయినా చేయిస్తుందని జగదీశ్‌ పాత్రతో తెరపై చూపించాడు డైరెక్టర్‌. కామెడీ బాగా పండింది కానీ కొంత సాగదీత ఉంది. కొన్ని సన్నివేశాలను ముందుగానే ఊహించే ఆస్కారం ఉండటం మైనస్‌. 

ఎవరెలా చేశారంటే?
జగదీష్‌ ప్రతాప్‌ బండారి నటనకు వంక పెట్టే పని లేదు. అంత బాగా నటించాడు. ప్రతి సన్నివేశంలో లీనమైపోయాడు. అతడి స్నేహితుడు అంజిగా నటించిన రాజ్‌ తిరందాస్‌ యాక్టింగ్‌ కూడా బాగుంది. వెన్నెల కిశోర్‌కు మంచి పాత్ర పడితే ఎలా విజృంభిస్తాడో చూపించాడు. బిత్తిరి సత్తి నిడివి ఇంకాస్త పెంచితే బాగుండేది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. తెలంగాణ పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాథ్‌ రెడ్డి చాలా సహజంగా, అద్భుతంగా ఆవిష్కరించారు. జై క్రిష్‌ నేపథ్య సంగీతం, పాటలు కథలో భాగంగానే ముందుకు సాగుతూ ప్రేక్షకులను లీనం చేసేందుకు దోహదపడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే.. కథ పక్కన పెడితే కామెడీ ఎంజాయ్‌ చేయవచ్చు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement