అసిన్‌కు పెళ్ళయింది! | asin marriage with Rahul Sharma | Sakshi
Sakshi News home page

అసిన్‌కు పెళ్ళయింది!

Published Tue, Jan 19 2016 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

అసిన్‌కు పెళ్ళయింది!

అసిన్‌కు పెళ్ళయింది!

అసిన్‌కు పెళ్ళయిపోయింది. ‘అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’ లాంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రముఖ సినీ నటి ఈ మంగళవారం నాడు ఓ ఇంటి ఇల్లాలైంది. తెలుగు, తమిళాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ పేరు తెచ్చుకున్న ఈ అందమైన మలయాళీ భామ ఎట్టకేలకు ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ ‘మైక్రోమ్యాక్స్’ సహ- వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను వివాహమాడింది. అసిన్ తొట్టుమ్‌కల్, రాహుల్ శర్మల వివాహం క్రైస్తవ సంప్రదాయంలో జరిగింది.
 
 ఆమిర్‌ఖాన్ నటించిన హిందీ ‘గజిని’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న 30 ఏళ్ళ ఈ పెళ్ళికూతురు సంప్రదాయ సిద్ధంగా తెల్లటి గౌన్ వేసుకుంటే, పెళ్ళికొడుకు నల్ల రంగు సూటు, టై ధరించారు. ఢిల్లీలోని ఓ రిసార్ట్ హోటల్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఈ పెళ్ళికి వధూవరుల ఆప్తమిత్రుడూ, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ప్రధాన కారకుడూ అయిన సినీ హీరో అక్షయ్‌కుమార్ హాజరయ్యారు. ఇరు కుటుంబాలకు అత్యంత ఆప్తులైన కొద్దిమంది సమక్షంలో పెళ్ళి ముగిసింది. ‘‘పెళ్ళి అద్భుతంగా జరిగింది. అందరూ అందంగా కనిపించారు.
 
  క్యాథలిక్ తరహాలో పెళ్ళి జరగాలన్నది అసిన్ ఆలోచన. అలాగే చేశాం’’ అని పెళ్ళికొడుకు తరఫు బంధువు ఒకరు చెప్పారు. పెళ్ళి సందర్భంగా ఢిల్లీకి చెందిన సంగీత బృందం ఎలోహిమ్ వర్షిప్ బ్యాండ్ పాటలు వినిపించారు. ఉదయం 11 గంటలకు మొదలైన క్రైస్తవ సంప్రదాయ వివాహం అరగంటలో ముగిసింది. ఆ తరువాత మంగళవారం సాయంత్రం అదే ప్రాంగణంలో హిందూ పద్ధతిలో వివాహ క్రతువు జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా సన్నిహితుల మధ్య పెళ్ళి చేసుకున్న అసిన్ దంపతులు ఈ నెల 23న ముంబయ్‌లో పరిశ్రమ వర్గీయులకూ, ఇతర సన్నిహితు లకూ వివాహ విందు ఇవ్వనున్నారు. ఉయ్ విష్ అసిన్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement